తీవ్ర పరిణామాలుంటాయి: హోదాపై కేంద్రానికి బాలయ్య హెచ్చరిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కేంద్రాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని గురువారం బాలకృష్ణ కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుతో పలు అంశాలపై చర్చించారు. హిందూపురంలోనే స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు గురించి ఆయనతో చర్చించారు. అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ఎవరినీ బతిమాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నీ కేంద్రం నిలబెట్టుకోవాలన ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన హామీలను కట్టుబడి ఉండకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. విభజన సమయంలో ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని నినదించిన పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.

"మనం అప్పుడప్పుడూ అంటూ ఉంటాం... దేనికో ఈ దిక్కుమాలిన జోహార్లు - దేనికో సిగ్గులేని దేబిరింపులు... ఏలకో రాయబారమని బేలమవుదము. ఎందుకో రాష్ట్ర లబ్దికై ఇంత రగడ. యాచన అన్నదే ఎరుగని ఆంధ్రరాష్ట్రం ఎంత దిగజారి పోయింది. ఎంత వింత సిగ్గు చేటు.. ఇదిగో... మన భుక్తి మనచేతియందే గలదు. ముష్టి ఎత్తుకొనుటయందు కాదు" అంటూ బాలకృష్ణ తన వాక్చాతుర్యంతో బీజేపీపై మండిపడ్డారు.
"ఆనాడు నాన్నగారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పి, దాన్ని నివారించడం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు రామారావుగారు పార్టీ పెట్టడం, కొత్త ఒరవడి రాజకీయాల్లోకి తీసుకురావడం, ఇవాళ ఆహార భద్రతకానీ... ఇవన్నీ... ఇప్పుడున్న ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఆనాడే మనం వీటన్నింటికీ శ్రీకారం చుట్టాం తెలుగువాళ్లం. ప్రజలను అలరించడానికి ఏవో ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. వాళ్లు తగిన శాస్తి అనుభవిస్తారు. నా అభిప్రాయం నేను చెప్పాను. మిగతా వాళ్ల గురించి నాకు అనవసరం. నేను ఇప్పుడు చెప్పింది బీజేపీ గురించేగా? కేంద్ర ప్రభుత్వాన్నేగా మనం హెచ్చరించింది" అని బాలకృష్ణ అన్నారు.
"మనవాళ్లంతా ధర్నాలు చేస్తున్నారు. హోదా ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడం జరిగింది. మేము దానికే కట్టుబడి వున్నాము. మరి వాళ్లిచ్చిన మాటే. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఘంటాపధంగా బద్దలు కొట్టి మరీ... హోదా గురించి బెంచీల మీద గుద్ది మరీ చెప్పారు. దానికి తప్పకుండా కట్టుబడే ఉండాలి. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అంతవరకూ రాదనే అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇవాళ ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి... ఇవాళ అనాధ రాష్ట్రం మనది. అన్ని రకాలుగా హామీలు ఇచ్చారు. అందుకు కట్టుబడి ఉండాలని మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నాను. లేకుంటా పర్యవసానాలను అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలి" అన్నారు.
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారని, పార్లమెంట్‌లో ఎంపీలు కూడా ఆందోళనలు చేస్తున్నారని చెప్పిన బాలకృష్ణ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని, రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications