భానుడి భగభగ: మార్చి నుండే వడగాలులు; రోళ్ళు పగిలే ఎండలు: కేంద్రం మార్గదర్శకాలు!!
ఈసారి ఎండలు విపరీతంగా ఉంటాయని, మార్చి నెల నుంచే వడగాల్పుల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అసాధారణ వేసవి నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఎండాకాలం రానే వచ్చింది. భానుడి భగభగలు మొదలయ్యాయి. అయితే ఈసారి ఎండలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎండల కాలాన్ని ఏ విధంగా గడపాలి? అని ఇప్పటినుంచే ఆలోచిస్తున్న వారు లేకపోలేదు. వారికి భారత వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈసారి ఎండలు విపరీతంగా ఉంటాయని, మార్చి నెల నుండే వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది . అసాధారణమైన ఎండలు నమోదు అవుతాయని భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది .భారతదేశంలో ఇప్పటికే అనేక ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

146 ఏళ్ళకు రికార్డు ఎండలు
దేశంలో ఈ ఫిబ్రవరిలో అత్యధిక ఎండలు నమోదు అయ్యాయని పేర్కొన్న వాతావరణ శాఖ, 1877 తర్వాత ఈ ఏడాది అధికంగా ఫిబ్రవరి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా తెలిపింది. ఈ ఫిబ్రవరి నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలు నమోదయిందని వెల్లడించింది. 146 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంతగా ఎండలు మండిపోయాయని పేర్కొంది . ఇక మార్చిలోనే వడగాలుల ప్రభావం ఉంటుందని, ఏప్రిల్, మే నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈసారి భానుడి భగభగలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ క్రమంలో కేంద్రం ఎండాకాలనికి మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

ఎండాకాలం జాగ్రత్త.. కేంద్రం మార్గదర్శకాలు ఇవే
ఎండాకాలం ఈసారి జాగ్రత్తగా ఉండాలని తగినంత నీటిని తాగాలని, శరీరం డీ హైడ్రేడ్ కాకుండా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి చూడాలని పేర్కొంది. ఓ ఆర్ ఎస్ ఎల్ తాగాలని, మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మరసాలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంది. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలని, బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు, క్యాప్, టవల్ తో తలను కవర్ చేసుకోవాలని పేర్కొంది. సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాలలో ఉండడానికి ప్రయత్నించాలని, ఉదయం సాయంత్రం వేళల్లోనే బయట పనులు చేసుకోవాలని వెల్లడించింది.

ఆ సమయంలో బయటకు వెళ్లొద్దు
ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావద్దని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచించింది. చెప్పులు లేకుండా బయటకు వెళ్లొద్దని, ఒత్తిడితో కూడిన పనులు చేయొద్దని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, మహిళలు ఎండాకాలంలో ఆరోగ్యం విషయంలో అదనపు శ్రద్ధ తీసుకోవాలని పేర్కొంది. పెంపుడు జంతువులను, పిల్లలను పార్క్ చేసిన కార్లలో వదిలి వెళ్ళొద్దని ఎండాకాలంలో కారులో ఉండే వేడి తీవ్రత చాలా డేంజర్ అని వెల్లడించింది.

వడదెబ్బ తగలకుండా జాగ్రత్త .. వడదెబ్బ తగిలితే లక్షణాలు ఇవే!!
వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని పేర్కొంది. ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే గుర్తించాలని, కళ్ళు తిరగడం, వికారంగా ఉండడం, తలనొప్పిగా ఉండడం, విపరీతమైన దాహం వేయడం, మూత్ర విసర్జన తగ్గడం, మూత్రం రంగు మారడం, గుండె దడ వంటి లక్షణాలు వడదెబ్బ యొక్క సాధారణమైన లక్షణాలని, ఎవరైనా వడదెబ్బకు గురైతే అత్యవసర పరిస్థితిలో 108కి కానీ 102కు కానీ కాల్ చేసి సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని పేర్కొంది. ఇక ఈసారి ఎండలు మండుతాయని కేంద్రం ముందే హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో సమ్మర్ విషయంలో బీ కేర్ ఫుల్.












Click it and Unblock the Notifications