హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజన: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఎలా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: విభజనలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేస్తూ దాని హోదాలను ఏ విధంగా నిర్ణయించాలనేది కేంద్ర ప్రభుత్వానికి సమస్యగా మారినట్లు తెలుస్తోంది. పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు రాజధానిగా హైదరాబాదును చేయాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినప్పటికీ ఏ విధంగా చేయలానే విషయంపై మాత్రం చిక్కుముడి వీడలేదు. హైదరాబాద్ శాంతిభద్రతలను తమ ఆధీనంలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కాంగ్రెసు తెలంగాణ నేతలు అంగీకరిస్తున్నారు.

అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాత్రం మెలిక పెడుతున్నారు. శాంతిభద్రతలను తెలంగాణ రాష్ట్రానికే అప్పగించాలని, అలా చేయకపోతే తెలంగాణను అవమానించడమే అవుతుందని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని కాస్తా అటూ ఇటుగా తెరాస శాసనసభ్యుడు టి. హరీష్ రావు ఆదివారం మంజీరా రచయితల వార్షికోత్సవ సభలో అన్నారు.

హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, సీమాంద్రుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సమాధానాలు అన్వేషిస్తోంది. ఇందుకు, కేంద్ర హోంశాఖకు చెందిన సీనియర్ అధికారుల బృందం మంగళవారం హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. గతంలో హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సలహాదారుగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె.విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ బృందం వస్తున్నట్లు సమాచారం.

వీరు గురువారం వరకు హైదరాబాద్‌లో ఉంటారని, మూడు రోజులపాటు ఇక్కడే ఉండి 'హైదరాబాద్ హోదా - తదుపరి చర్యల'పై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారని అంటున్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతోపాటు రెండు రాష్ట్రాలకు రాజధానిగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుందని సమాచారం.

రాజ్యాంగంలో 'కేంద్ర పాలిత ప్రాంతం' ప్రస్తావన మాత్రమే ఉంది. 'ఉమ్మడి రాజధాని' గురించి రాజ్యాంగంలో లేదు. దీంతో విభజన సమయంలో హైదరాబాద్‌పై స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లులో జలాల పంపిణీ, విద్యుత్తు, ఆస్తులు-అప్పుల పంపకంపై నిర్దిష్టంగా చెప్పక్కర్లేదు. రాష్ట్ర విభజన జరిగిన తక్షణం హైదరాబాద్ నుంచి సీమాంధ్ర రాష్ట్ర పాలన కూడా సాగాల్సి ఉంటుంది. 'తాత్కాలిక రాజధాని' అంటే ఇలాంటి సమస్యలేవీ తలెత్తవు. 'పదేళ్లు ఉమ్మడి రాజధాని'గా ప్రకటించినందున విభజన బిల్లులో హైదరాబాద్ హోదా, దానిపై ఆజమాయిషీ తదితర వివరాలను స్పష్టంగా వివరించాల్సిందేనని అంటున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు కేంద్రీకృతమైన నాంపల్లి, ఖైరతాబాద్ మండలాలను ఉమ్మడిగా చేస్తే సరిపోతుందని తెలంగాణ నేతలు అంటున్నారు. విభజన తర్వాత కంటోన్మెంట్‌లాంటి ఏదో ఒక ప్రత్యేక ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన నడుపుకోవచ్చునని తెలంగాణ జెఎసి అభిప్రాయపడింది. హైదరాబాద్‌ను యూటీ చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని సీమాంధ్రకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి శాంతి భద్రతలు, రెవెన్యూ వంటి కొన్ని అంశాలు కేంద్రం చేతిలో ఉంచుతారని కూడా వార్తలు వచ్చాయి.

'హైదరాబాద్‌లో పరిపాలన కేంద్రం లేదా గవర్నర్ చేతిలో ఉంటుంది' అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ బహిరంగంగానే ప్రకటించారు. దాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌కు అప్పగించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

English summary
Union home ministry officials are coming to Hyderabad to study to define the status of common capital after the bifurcation of Andhra Pradesh. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X