చంద్రబాబుకు నోటీసు: టిడిపి అధ్యక్షుడికా, ఎపి సిఎంకా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ ఎసిబి ఇప్పుడో అప్పుడో నోటీసులు జారీ చేయవచ్చునని ప్రచారం సాగుతోంది. రాజకీయంగా ఆ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్యగా చిచ్చుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆడియో టేపుల ద్వారా, రేవంత్ విచారణ సారాంశాన్ని బట్టి చంద్రబాబు నాయుడుని నోటుకు ఓటు కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ తెలంగాణ అధికారులు నోటీసులు ఓ హోదాను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు నోటీసులు ఇస్తారనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబును టిడిపి అధ్యక్షుడిగా పరిగణనలోకి తీసుకుని నోటీసు జారీ చేస్తారా, ఎపి ముఖ్యమంత్రి హోదాను పరిగణనలోకి తీసుకుని జారీ చేస్తారా అనేది ప్రశ్న
ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ. 50 లక్షలు స్టీఫెన్ సన్ కు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చేందుకు బలమైన ఆధారాలను ఎసిబి సేకరించిందని అంటున్నారు. ఆ ఆధారాలేమిటో, అందులో వాస్తవం ఎంతో ఇప్పటి వరకు తేలలేదు. కానీ, సాక్షిగా పరిగణిస్తూ చంద్రబాబుకు ఎసిబి నోటీసులు జారీ అవకాశం ఉంటుందని అంటున్నారు.

అయితే నోటుకు ఓటు వ్యవహారం తెలుగుదేశం పార్టీకి చెందింది. ఈ వ్యవహారంలో లబ్ధిదారు టిడిపి అవుతుంది. ఆ పార్టీకి జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. చట్టపరంగా లబ్ధిదారుడికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబును పరిగణనలోకి తీసుకుని ఎసిబి నోటీసులు జారీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు తెలంగాణ ఎసిబి నోటీసులు అందుకున్నా ఆయన ఎపి ముఖ్యమంత్రి పదవికి కూడా గండం వచ్చి పడుతుందని అంటున్నారు. చంద్రబాబు రాజీనామా చేయక తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications