హుధుద్ తుఫాను: 35కు చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్: హుధుద్ తుఫానులో మరణించినవారి సంఖ్య 35కు చేరింది. తుఫాన తాకిడికి తీవ్రంగా గురైన విశాఖపట్నం జిల్లాలో 25 మంది, విజయనగరం జిల్లాలో 8 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మరణించినట్లు అంచనా. కాగా, ప్రభుత్వం మాత్రం 26 మంది మరణించినట్లు ప్రకటించింది.
సహాయక బృందాలు 146 మందిని కాపాడాయని ప్రభుత్వం చెప్పింది. తుఫాను తాకిడికి 7806 ఇళ్లు ధ్వంసమైనట్లు, 219 చోట్ల రైలు పట్టాలు దెబ్బ తిన్నట్లు తెలిపింది. మొత్తం 8306 విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయని, 19 చోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

తుఫాను తాకిడికి 181 పడవలు గల్లంతయ్యాయని, 3368 పశువులు మరణించాయని చెప్పారు. తుఫాను ప్రభావం మొత్తం 2 కోట్ల మందిపై పడిందని చెప్పారు. 223 పునరావాస శిబిరాలు, 223 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
తుఫాను నష్టంపై ఇంకా కచ్చితమైన అంచనా వేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే, 70 వేల కోట్ల రూపాయల దాకా నష్టం వాటిల్లి ఉంటుందని ఆయన బుధవారంనాడు మీడియాతో చెప్పారు.
తుఫాను తాకిడి ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినన్ని ఉన్నాయని, ఆయిల్ కంపెనీల బంకుల్లో కొనుగోలు చేయవచ్చునని, అదనపు ధరలు చెల్లించాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications