అక్రమ సంబంధం ఆమె నెత్తురు కళ్ల చూసింది.. : అత్యంత కిరాతకంగా..
విజయనగరం : వివాహేతర సంబంధాలు దారుణ హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో ఓ వివాహిత పూజలో నిమగ్నమై ఉండగా.. భర్త ఆమెను కిరాతకంగా హతమార్చాడు. జిల్లా కేంద్రంలోని కొత్తవలస జంక్షన్ లో ఉన్న గోపీకృష్ణా హోటల్ బిల్డింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనా వివరాలను పరిశీలిస్తే.. గోపి పాపారావు అనే వ్యక్తికి 20 ఏళ్ల క్రితం తన మేనకోడలు లక్ష్మీ భవానీతో (38) వివాహమైంది. కొంతకాలం పాటు వీరి కాపురం సాఫీగానే సాగినా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడం మొదలయ్యాయి. అదీగాక మధ్యలో గోపి ఆరోగ్యం కూడా బాగాలేక పోవడంతో.. భర్తతో దూరంగా ఉంటూ వస్తోంది లక్ష్మీ భవాని. దీంతో అప్పటినుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు భర్త గోపి.
భర్త వేధింపులు తాళలేక లక్ష్మీ భవానీ కోర్టును కూడా ఆశ్రయించింది. తనను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అతనిపై కేసు వేసింది. అయితే ఎన్ని విబేధాలున్నా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు భార్యభర్తలు.

ఇదిలా ఉంటే.. కొత్తవలస విశాఖపట్నం రోడ్డులో ఓ సెల్ షాపు నిర్వహిస్తోన్న శ్రీనివాసరావు అనే వ్యక్తితో లక్ష్మీ భవానికి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ అనుమానంతోనే భార్యపై కక్షను పెంచుకున్న భర్త గోపి భార్యను ఆమె ప్రియుడిని ఇద్దరినీ హతం చేయాలని భావించాడు. కాగా ఇదే విషయమై గోపి గతంలోను ఇద్దరిని హెచ్చరించనట్టు సమాచారం.
అయితే ఎన్నిసార్లు చెప్పినా భార్య తీరులో మార్పు రాకపోవడంతో తీవ్ర అసహనానికి లోనైన సదరు భర్త చివరికి భార్యపై కిరాతకానికి ఒడిగట్టాడు. పూజ చేసుకుంటున్న సమయంలో ఓ ఇనుప రాడ్ తో వెనుక వైపు నుంచి ఆమె తలపై బలంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్త స్రావమైన లక్ష్మీ భవాని అక్కడిక్కడే చనిపోయింది.
భార్యను హత్య చేసిన అనంతరం.. ఆమె ప్రియుడిపై కూడా గోపి దాడికి యత్నించగా
స్వల్ప గాయాలతో అతను తప్పించుకున్నాడు. అటు తర్వాత నిందితుడు గోపి స్వయంగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
కాగా లక్ష్మీ భవాని గోపిలు గోపీకృష్ణా హోటల్ పై నివాసముంటుండగా.. ఆమె హత్య జరిగిన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకునే వరకు హోటల్ సిబ్బందికి హత్య విషయం తెలియకపోవడం గమనార్హం. అనంతరం లక్ష్మీ భవాని మృత దేహానికి పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications