కృష్ణాలో దారుణం: అనుమానంతో భార్య, మామను కత్తితో పొడిచి చంపాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కత్తితో భార్య సహా మామ, అత్త, బావమరిదిపై దాడికి దిగిన ఘటన జిల్లాలోని చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య, మామ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బావమరిదికి తీవ్రగాయాలయ్యాయి.

పోలీసులు కథనం ప్రకారం... కోటపాడు గ్రామానికి చెందిన వేముల వెంకటేశ్వరరావు(55) కుమార్తె విజయ (25)ను బాపులపాడు మండలం వేలేరుకు చెందిన కొనకళ్ల సుబ్రమణ్యంకు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిపించారు. కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగింది. అయితే సుబ్రమణ్యం మద్యానికి బానిస అవడంతో వీరి సంసార జీవితంలో గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో సుబ్రమణ్యం భార్య పుట్టింటికి చేరుకుంది. దీంతో పుట్టింటికి చేరిన భార్యపై కోపం పెంచుకున్న సుబ్రమణ్యం గురువారం తెల్లవారుజామున సైకిల్‌పై భార్య పుట్టింటికి చేరుకుని నిద్రిస్తున్న మామ వెంకటేశ్వరరావును కత్తితో పొడిచి చంపాడు. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన భార్య విజయపై దాడి చేసి ఆమెను కూడా హతమార్చాడు.

Husband Kills Wife and uncle Due

రెప్పపాటులో జరిగిన ఈ దాడిలో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బావమరిది శివరామకృష్ణ, అత్తపైనా సుబ్రహ్మణ్యం దాడి చేశాడు. శివరామకృష్ణకు తీవ్ర గాయాలు కాగా అతడి తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. స్థానికులు వచ్చేలోపు పరారైన సుబ్రమణ్యం పక్కనే ఉన్న పర్వతాపురం అనే గ్రామానికి చేరుకున్నాడు.

అప్పటికే ఈ దాడి గురించి సమాచారం తెలుసుకున్న ఎ.కొండూరు మండలం పొలిశెట్టిపాడు గ్రామానికి చెందిన మృతుడు వెంకటేశ్వరరావు తోడల్లుడు మిద్దె సత్యనారాయణ తన అల్లుడు వెంకటేశ్వరరావుతో కలిసి అటోలో పర్వతాపురం రాగా నిందితుడు సుబ్రమణ్యం తారసపడ్డాడు.

ఈ క్రమంలో అతడిని ఆపేందుకు యత్నించిన వెంకటేశ్వరరావుపైనా అతడు దాడికి దిగాడు. ఈ దాడిలో వెంకటేశ్వరరావుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్థానికులు అప్రమత్తమై నిందితుడు సుబ్రమణ్యాన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఈ దాడిలో గాయపడ్డ శివరామకృష్ణను ఏలూరు ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు, తిరువూరు సీఐ కిశోర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు స్థానికుల దాడిలో గాయపడిన సుబ్రమణ్యంను తిరువూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయి తల్లి ఫిర్యాదు మేరకు సుబ్రమణ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Husband Kills Wife and uncle Due To Family Strife In Krishna District.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి