హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ .. ఏపీలో మొదటి అడుగు!
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి, అత్యాధునిక స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ ఉద్దేశంతోనే వందే భారత రైళ్ళను ప్రవేశపెట్టి రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేసింది. ప్రస్తుతం మరింత అడ్వాన్స్డ్ గా ప్రపంచ స్థాయి వేగవంతమైన రైల్వే నెట్వర్క్ ను నిర్మించే పనిలో పడింది. ఆ దిశగా బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.
హైదరాబాద్ బెంగళూరు కారిడార్ పనుల కోసం సర్వే
దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు నెట్వర్క్ ను మరింత విస్తరించాలని ప్రయత్నం చేస్తున్న రైల్వే ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ కారిడార్లో బుల్లెట్ ట్రైన్ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుత హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను ప్రకటించిన రైల్వే ఈ రెండు బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు సుమారు 5.5 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం హైదరాబాద్ బెంగళూరు కారిడార్ పనుల కోసం ప్రాథమిక సర్వే మొదలైంది.

ట్రాక్ నిర్మాణం జరిగే ప్రాంతాలలో మట్టి సేకరణ
హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ 65 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 263 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా గుండా వెళుతుంది. ఈ ప్రాథమిక సర్వేలో భాగంగా ఏపీలోని వివిధ ప్రాంతాలలో ట్రాక్ నిర్మాణం జరిగే ప్రాంతాలలో మట్టిని సేకరిస్తున్నారు. ఈ మట్టి నమూనాలను పరిశీలించి బుల్లెట్ ట్రైన్ యొక్క వేగాన్ని తట్టుకునేందుకు నిర్మించే ట్రాక్ కు ఈ మట్టి అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది పరిశీలిస్తారు.
స్పీడ్ ట్రాక్ నిర్మాణం కోసం మట్టి పరిశీలన చేస్తున్న అధికారులు
దీనికోసం జియో టెక్నికల్, జియో ఫిజికల్ మట్టి పరీక్షలను నిర్వహించడం కోసం నిర్మాణ స్థలాలలో డ్రిల్లింగ్ చేసి మట్టిని, బండరాళ్ళ నమూనాలను సేకరిస్తున్నారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లకు సంబంధించి ట్రాక్లను ఈ మట్టి పైన నిర్మాణం చేయొచ్చా లేదా అన్నది పరిశీలిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారానే ట్రాక్ ఏ విధంగా నిర్మించాలి? ఎక్కడ సొరంగాలు, ఎలివేటెడ్ మార్గాలు నిర్మించాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటారు.
హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం పడుతున్న అడుగులు
ఏది ఏమైనా హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మాణంలో ప్రస్తుతం ప్రాథమిక సర్వే చేస్తూ మట్టి నమూనాలను సేకరించడం ఒక ముఖ్యమైన అడుగు కాగా, ఇది పూర్తయితే హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ ఏపీలోని ఆ ప్రాంతానికి కూడా మహర్దశ పట్టిస్తుంది అన్నది ముఖ్యమైన విషయం.












Click it and Unblock the Notifications