చంచల్ గూడ జైలుకు వివేకా కేసు నిందితులు-సీబీఐ కోర్టు ఆదేశాలు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ప్రారంభించిన హైదరాబాద్ సీబీఐ కోర్టు.. ఇవాళ ముగ్గురు నిందితుల్ని చంచల్ గూడ జైలుకు పంపింది.
ఏపీలో నాలుగేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణలో మొదలైంది. ఇవాళ హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో నిందితులు తొలిసారి సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు.
వివేకా హత్య కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న ముగ్గురు నిందితులతో పాటు బెయిల్ పై ఉన్న మరో ఇద్దరు నిందితుల్ని సైతం సీబీఐ అధికారులు ఇవాళ హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే సీబీఐ వేసిన అనుబంధ చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. విచారణ ప్రారంభించింది. ఈ కేసులో కడప జైల్లో ఉన్న నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ను ప్రొడక్షన్ వారంట్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తెచ్చారు. అలాగే బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డితో పాటు అప్రూవర్ గా మారిన మరో నిందితుడు దస్తగిరి కూడా ఇవాళ విచారణకు హాజరయ్యారు.

ఈ కేసుకు సంబంధించిన ప్రాధమిక వివరాలు తెలుసుకున్న హైదరాబాద్ సీబీఐ కోర్టు.. ఇవాళ విచారణ తర్వాత కడప జైలు నుంచి వచ్చిన నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ను చంచల్ గూడ జైలుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. బెయిల్ పై వచ్చిన మిగిలిన ఇద్దరు నిందితులు గంగిరెడ్డి, దస్తగిరిని ప్రాథమిక విచారణ తర్వాత వదిలేసింది. ఈ కేసు విచారణను మార్చి 10కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు.. ఆ లోపు మిగిలిన వివరాలు సమర్పించాలని సీబీఐ అధికారుల్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications