టీలోనే హైదరాబాద్: సీమాంధ్ర రాజధానికి ప్యాకేజీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) ప్రతిపాదనలో మార్పు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధంగా లేదని అంటున్నారు. హైదరాబాద్ విషయంలో కేబినెట్ నోట్‌లో ఏ విధమైన మార్పు ఉండదని చెబుతున్నారు. ఈ మేరకు పిటిఐ ఓ వార్తాకథనాన్ని వెలువరించింది. పైగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
హైదరాబాదును తెలంగాణ రాష్ట్రంలో భాగంగానే ఉంచుతారని, ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్ల పాటు మాత్రం శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని అంటున్నారు. ప్రతిగా సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ప్రకటించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు పిటిఐ వార్తాకథనం సారాంశం.

అధునాతన సౌకర్యాలతో సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు భారీగా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే తెలంగాణలో సమస్యలు తలెత్తవచ్చునని కేంద్రం భావిస్తున్నట్లు పిటిఐ తెలిపింది.
విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం రాష్ట్రానికి వచ్చే అవకాశం కూడా లేదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దానివల్ల సమస్యలు కొలిక్కి వస్తాయని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications