ఎకనమిస్ట్‌ని: జగన్‌కు బాబు, వెంకన్నకి హానీచేస్తే అంతే
హైదరాబాద్: రాజధాని పైన ఏపీ సీఎం చంద్రబాబు గురువారం శాసన సభలో ప్రకటన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పంటరుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు, బంగారంపై పంట రుణాలు మాఫీ చేస్తానని చెప్పానని, వాటిని చేస్తామన్నారు. రుణమాఫీని తాను చేసి చూపిస్తానని చంద్రబాబు సభలో బల్లగుద్దినట్లు మరీ నొక్కి చెప్పారు!
తాను ఓ రైతు బిడ్డనని, రైతు కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. మీరు చెబితే నేర్చుకోవాల్సిన స్థితిలో తాను లేనన్నారు. రుణమాఫీ తాను దృఢసంకల్పంతో తీసుకున్నానని, అంతేకాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తానని చెప్పారు.
తాను మీ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. తాను ఎకనమిక్ స్టూడెంట్‌నని, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పారు. మనం సమస్యల్లో ఉన్నామని, సలహాలు ఇచ్చి ప్రతిపక్షం ప్రోత్సహించాలని హితవు పలికారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వర్షం నీటిని వినియోగించుకుంటే రాష్ట్రానికి ఏ నీటి సమస్యా రాదన్నారు.

చంద్రబాబు మాట్లాడుతుండగా.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా ఘాటుగా స్పందించారు. మీరు మైండ్ గేమ్ ఆడాలని చూస్తున్నారని, తాను అంతకు వందరేట్లు మైండ్ గేమ్ ఆడగలనని అన్నారు. తన ఆత్మస్థైర్యం ముందు మీది నిలబడదన్నారు. మీలాంటి వాళ్లకు కొన్ని లక్షలమందికి సమాధానం చెప్పానని అన్నారు. గతంలో నేను చెబుతుంటే చాలామంది మీలాగే ఆశ్చర్యం వ్యక్తం చేశారని, ఆ తర్వాత తాను తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి తనదే రైట్ అన్నారని తెలిపారు.
ప్రధాని ఎక్కడకు వెళ్లినా మేడ్ ఇన్ ఇండియా కావాలని కోరుకుంటున్నారన్నారు. జపాన్ నుండి పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దానిని ఉపయోగించుకొని ఏపీని అభివృద్ధి చేసుకోవాలన్నారు. విమర్శలు వద్దని, విజ్ఞతతో వ్యవహరిద్దామన్నారు. వెంకటేశ్వర స్వామి పవర్ ఫుల్ గాడ్ అన్నారు. ఆయనకు హాని తలపెట్టిన వారు ఎవరు కూడా బాగుపడలేదని చంద్రబాబు సభలో వ్యాఖ్యానించారు.
తిరుపతి అభివృద్ధికి కారణం తిరుమల తిరుపతి దేవస్థానం వల్లనే అన్నారు. అలాగే కడప దర్గాకు దేశమంతా వస్తారన్నారు. వీటిని ఉపయోగించుకుందామన్నారు. టూరిజానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయన్నారు. టూరిజం అభివృద్ధి జరగాలంటే శాంతిభద్రతలు ముఖ్యమన్నారు. అందుకోసం ప్రతి ఎమ్మెల్యే కృషి చేయాలన్నారు. ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్లు వేస్తామన్నారు. ఐదు గ్రిడ్ల ద్వారా రోడ్లు, కరెంట్, విద్యుత్, గ్యాస్, పైబర్ కనెక్టివిటీ చేస్తామన్నారు.
విద్యారంగంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. నీరు, చెట్టు కార్యక్రమంతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామన్నారు. కరవు నివారణ చర్యలు చేపడతామన్నారు. తాను చెప్పినవన్నీ చేసి చూపిస్తానని చెప్పారు. పరిశ్రమల కోసం స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. 14 పోర్టులను డెవలప్ చేయాలని చూస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications