చేస్తామనడం తప్ప, నమ్మకం లేదు: బాబుపై మైసూరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది చేస్తాం, ఇది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలు చెబుతున్నారే తప్ప ఇంత వరకు చేసిందేమీ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి ఆదివారం ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు.
రాజధాని నిర్మాణం కూడా అతి కష్టం మీద జరుగుతుందన్నారు. రాజధాని ప్రకటన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న బాధ్యతారాహిత్య ప్రకటనలతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

'ఆదివారం రాయలసీమకే రాజధాని హక్కు' సదస్సు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సదస్సుకు మైసూరా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీని సింగపూర్ తరహాలే అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని అయితే, సింగపూర్ నగరం 740 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందని, అలా రాష్ట్రం అభివృద్ధి కావాలంటే విస్తీర్ణమైన భూములు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సహాయ సహకారాల విషయంలో ఎల్లప్పుడు తాము అందుబాటులో ఉంటామని చెప్పారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలంటే ఒకే అభిప్రాయంతో కమిటీ ముందుకు వెళ్తే బాగుంటుందని మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications