వైయస్ జగన్‌తో నేను మాట్లాడలేదు: ఖండించిన సిఎం రమేష్, వివరణ
హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడానంటూ వచ్చిన వార్తలను తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేశ్ ఖండించారు.
విద్యుత్తు ఉద్యోగుల సమస్యపై ఆయన జగన్‌తో మాట్లాడారని, తదుపరి జగన్ ఇదే అంశంపై టిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు కెటి రామారావుతో మాట్లాడారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సిఎం రమేశ్ గురువారం ఓ వార్తతో సంస్థతో మాట్లాడుతూ.. ఆ వార్తలను ఖండించి, వివరణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తమని చెప్పారు.

‘నాకు జగన్‌తో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? కడప జిల్లాలో మేం రాజకీయ ప్రత్యర్థులం. నేను ఆయనకు ఫోన్ చేయలేదు. మాట్లాడలేదు. కొంత కాలం కిందట విద్యుత్ ఉద్యోగులు ఢిల్లీలో నన్ను కలిశారు. నాతోపాటు మిగిలిన టిడిపి ఎంపీలను కూడా కలిశారు' అని తెలిపారు.
విద్యుత్ ఉద్యోగులును వెంట తీసుకొని కేంద్ర హోం మంత్రి వద్దకు వెళ్లి సమస్య వివరించామని చెప్పారు. ఆ తర్వాత వారెవరూ తన దగ్గరకు రాలేదని అన్నారు. తాను ఎవరికీ ఫోన్లు చేయలేదని స్పష్టం చేశారు.
తాము అధికారంలో ఉన్నామన్న ఆయన, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేస్తానని ప్రశ్నించారు. ఇదంతా అవాస్తవ ప్రచారమేనని కొట్టిపారేశారు టిడిపి ఎంపి సిఎం రమేష్.












Click it and Unblock the Notifications