తెలంగాణ ఏర్పాటులో నాది కీలక పాత్ర: వెంకయ్య నాయుడు
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాను నిర్వహించిన పాత్ర చాలా ఉందని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు అన్నారు. ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నవాడు ఎన్నడూ మారబోడని, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో ప్రజలు ఆగ్రహించారని, కోప్పడ్డారని ఆయన అన్నారు. విజయవాడలోని గేట్‌వేలో పోలవరం ప్రాజెక్టు పుస్తకావిష్కరణ సభలో శనివారంనాడు ఆయన మాట్లాడారు
తెలంగాణ ఏర్పడాలి, ఆంధ్రప్రదేశ్‌కరు అన్యాయం జరగకూడదనే పట్టుదలతో వ్యవహరించానని ఆయన అన్నారు. కులం, మతం, ప్రాంతం వంటి ఉద్వేగాలకు లోను కాకుండా పరిపక్వతతో తమ పార్టీ తెలంగాణ విషయంలో వ్యవహరించిందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్క శాతం నష్టం కూడా లేదని ఆయన అన్నారు. గోదావరి నుంచి 80 టిఎంసిల నీటిని కృష్ణానదికి తరలించవచ్చునని ఆయన చెప్పారు. వరద జలాలను మళ్లించగలిగితే రాయలసీమకు 45 టిఎంసిల నీటిని అందించవచ్చునని చెప్పారు.

నదుల అనుసంధానంలో భాగంగా వృధాగా పోతున్న జలాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వరదల జలాలను దారి మళ్లిస్తే 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేపడితే ఒకరిద్దరికి కష్టం వస్తుందని, వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెంకయ్య నాయుడు అన్నారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల 154 రెవెన్యూ గ్రామాలు, 9 మండలాలు ముంపునకు గురవుతాయని చెప్పారు. విశాల ప్రజా ప్రయోజనం దృష్ట్యా కొంత మందికి ఇబ్బంది తప్పదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టుగా వెంకయ్య నాయుడు అభివర్ణించారు.












Click it and Unblock the Notifications