YS Jagan: 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కా-జగన్ కోసం రెండు బటన్లు నొక్కలేరా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గత 57 నెలల్లో సాధించిన ఘనతల్ని ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు గుర్తుచేశారు. 57 నెలల్లో ఎన్నో పథకాల నిధుల విడుదల కోసం 124 సార్లు బటన్ నొక్కానని జగన్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అలాగే మీరు జగన్ కోసం ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కలేరా అని అడగాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఒకటి, పార్లమెంట్ ఎన్నికల కోసం మరో బటన్ నొక్కాలని కోరారు.
చంద్రబాబు పాలనకూ, 57 ఏళ్ల జగన్ పాలనకూ తేడా గమనించాలని ప్రజల్ని జగన్ కోరారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రతీ గ్రామంలో వచ్చిన మార్పు గమనించాలన్నారు. సచివాలయ వ్యవస్ధ ద్వారా గ్రామాల్లో వచ్చిన మార్పు చూడాలన్నారు. ఈ వ్యవస్ధ ఎవరు తెచ్చారంటే జగన్ అని చెప్పాలని క్యాడర్ ను కోరారు. గ్రామ సచివాలయాల్లో 500 సేవల్ని లంచాలకు తావులేకుండా అందిస్తున్నామన్నారు. నాడు-నేడుతో ఆస్పత్రుల రూపురేఖల్లో మార్పులు, ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్ లు తెచ్చామన్నారు.

కేబినెట్లో 68 శాతం పదవులు వెనుక బడిన వర్గాలకు ఇచ్చామని జగన్ తెలిపారు. 4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్ సహా వెనుకబడిన వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయం అమలు చేశామన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కాచెల్లెమ్మలకు ఇచ్చామన్నారు. ప్రతీ గ్రామంలో విలేజ్ క్లినిక్ లు, 15 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్ లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చామని, ప్రతీ హామీనీ నెరవేర్చామన్నారు. వచ్చే ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్ణయించేవన్నారు.

ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని జగన్ తెలిపారు. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతీ ఒక్కరికీ చెప్పాలన్నారు. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలన్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ పోలింగ్ బూత్ కు వెళ్లి బటన్ నొక్కాలన్నారు. చంద్రబాబు రాజకీయం అంతా ఎత్తులు, పొత్తులేనని, గ్లాస్ ప్రతీ ఒక్కరి రక్తం తాగుతుందని జగన్ ఆరోపించారు. ఎన్నికలప్పుడు మాత్రం టీడీపీకి ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడన్నారు. ఎన్నికలు వస్తే చంద్రబాబు దత్తపుత్రుడిని పిలుస్తాడని, రాష్ట్రాన్ని విడదీసిన పార్టీ కూడా వస్తోందన్నారు.












Click it and Unblock the Notifications