ఆ విధ్వంస సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు: పవన్, వీరతెలంగాణ పోరాట స్ఫూర్తి చూశానంటూ
శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర గడ్డపై వీర తెలంగాణ పోరాట స్ఫూర్తిని చూశానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భారతీయ ఆత్మ దోపీడీ శక్తులకు, వారి పన్నాగాలకు ఎన్నడూ లొంగదని, అలాంటి ఆత్మబలం ఉత్తరాంధ్ర ప్రజల్లో కనిపించిందని ఆయన పేర్కొన్నారు.
పవన్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. రంజాన్ కారణంగా జనపోరాట యాత్రకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన పవన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. వివిధ అంశాలపై ట్విట్టర్‌లో ఆయన తన వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. మెకాలే చనిపోయినా దేశీయ సంస్కృతిని దెబ్బతిస్తూ వనరుల విధ్వంసానికి పాల్పడ్డ ఆయన సిద్ధాంతాన్ని ఇప్పటికీ ముందుకు తీసుకువెళ్తున్నారని వాపోయారు.

మన నాయకుల నిర్లక్ష్యం, దోపిడీ గమనించా
ప్రస్తుతం ఆ పని చేస్తోంది ఇక్కడి ప్రముఖ నాయకులేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాతో పాటు అరకులోను 30 రోజుల పాటు పర్యటించాక ఇది తనకు కలిగిన అభిప్రాయమని చెప్పారు. ఉత్తరాంధ్రపై మన నాయకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, దోపీడిని తాను గమనించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. కొంపల్లి హెచ్‌ఎస్‌ఎస్ సుందర్ పుస్తకంలోని ఒక పేజీని ఆయన పోస్టు చేశారు.

ఉత్తరాంధ్రలో పర్యటించిన పవన్
పవన్ కళ్యాణ్ ఇటీవల ఉత్తరాంధ్రలో పర్యటించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన ఆయన యాత్ర విజయనగరం, ఆ తర్వాత విశాఖపట్నంలో కొనసాగింది. సామాజిక అనుసంధాన వేదిక ద్వారా తన అనుభవాన్ని రెండు మూడు ట్వీట్లలో వెల్లడించారు. ఆయన తన పర్యటనలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.

రంజాన్ పర్వదినం సందర్భంగా విరామం
రంజాన్ పర్వదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ తన జనసేన పోరాట యాత్రకు విరామం ఇచ్చారు. గత శుక్రవారం అనంతరం పర్యటనకు విరాణం ఇచ్చారు. ఆ తర్వాత శనివారం ఉదయం విశాఖపట్నంకు చెందిన కొందరు మేధావులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన చర్చించారు.

పవన్ పర్యటన
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆయన విస్తృతంగా పర్యటిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని, మోడీని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications