నా పరువు తీసేలా ఉంది: వెంకయ్యతో భేటీపై చిరు క్లారిఫై
న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర కోసం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడును తాను కలిసినట్లుగా వచ్చిన వార్తలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం ఖండించారు. అది పూర్తిగా అవాస్తవమన్నారు. అది తన ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంకయ్య అంటే నాకు ఎంతో గౌరవమని కానీ, బిజెపికి చెందిన ఆయనను మార్గదర్శకత్వం అందించాలని తాను కోరడం ఎలా సాధ్యమని చిరంజీవి పేర్కొన్నారు. శుక్రవారం తాను వెంకయ్యను కలవనే లేదన్నారు. ఇలాంటి వార్తలు రావడం బాధాకరమని, దురదృష్టకరమని తెలిపారు. ఈ వార్త అందరినీ గందరగోళానికి గురి చేసిందని, లేనిపోని ఊహాగానాలకు, విమర్శలకు తావిచ్చినట్లయిందన్నారు.

బొత్సకు పరామర్శ
స్వల్ప అస్వస్థతకు గురై నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణను శనివారం పలువురు ప్రముఖులు కలిసి పరామర్శించారు. కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, పనబాక లక్ష్మి, ఎంపి వివేక్, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, తదితరులు పరామర్శించారు. ఇలాఉండగా బొత్స కోలుకుంటున్నారని, ఒకటి, రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారని ఆయన సన్నిహితులు తెలిపారు.
కిరణ్ పైన మోదుగుల
మళ్లీ పదవిలో ఉంటానో లేదో అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హడావుడిగా పులిచింతలను ప్రారంభిస్తున్నారని టిడిపి ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ పులిచింతల నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని ఎంపీ మోదుగుల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications