నా తడాఖా చూపిస్తా: టిపై కావూరి, విడిపోయినా: తోట
ఏలూరు: తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే తన తడాఖా చూపిస్తానని కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు మంగళవారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విభజన ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రీయ పద్దతుల్లోనే జరగాలన్నారు. రాష్ట్ర విభజన జరిగితే భద్రాచలంను సీమాంధ్ర ప్రాంతంలో కలపాలని డిమాండ్ చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో చేర్చాలన్నారు. బిల్లు పార్లమెంటుకు వస్తే తమ తడాఖా చూపిస్తామన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్నారు.
తాము సమన్యాయం కంటే సమైక్యవాదానికే మొగ్గు చూపుతున్నామన్నారు. సమైక్యాంధ్రపై ఎంపీల మధ్య ఎలాంటి బేదాభిప్రాయాలు లేవన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో కచ్చితంగా మార్పులుంటాయన్నారు. పోలవరం పూర్తి కావాలంటే భద్రాచంల సీమాంధ్రలో కలవాల్సిందేనని, అలా కలుస్తుందన్నారు. కొంతమంది కాంగ్రెసు పార్టీ పని అయిపోయినట్లే అంటున్నారని కానీ, 130 ఏళ్ల కాంగ్రెసుకు తిరుగు లేదన్నారు.

పార్టీని వీడను: తోట
తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేది లేదని మంత్రి తోట నర్సింహం వేరుగా అన్నారు. తాను పార్టీని వీడనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. తమ కుటుంబం ముప్పై ఏళ్లుగా కాంగ్రెసులోనే ఉంటుందన్నారు. రాష్ట్రం కలిసున్నా, విడిపోయినా వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెసు పార్టీ నుండే పోటీ చేస్తానని చెప్పారు.
రాష్ట్రపతికి అఫిడవిట్లు: అశోక్ బాబు
సీమాంధ్రలోని పదమూడు జిల్లాల ఎమ్మెల్యేల నుండి అఫిడవిట్లు తీసుకొని రాష్ట్రపతికి పంపిస్తామని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు గుంటూరులో అన్నారు. విభజన బిల్లు విషయంలో అసెంబ్లీ ముట్టడి, నేతల నిర్బంధంపై పండుగ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications