అదే జరిగితే ఏపీలో సీఎం కుర్చీతో మ్యూజికల్ చైర్స్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఏ విధంగానైనా అధికారంలోకి రావాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుంచే ప్రజాక్షేత్రంలోకి వెళుతూ పోటాపోటీగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ప్రతిపక్ష టీడీపీ, జనసేనలను ఉద్దేశించి ట్విట్టర్ లో వరుస ట్వీట్లు పెట్టారు.
ఏపీలోని ప్రతిపక్షాలకు ఏపీకి సంబంధించి ఎజెండా లేదు, వారికి కేవలం జెండాలు మాత్రమే ఉన్నాయని విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిపై దృష్టి లేదు, ప్రణాళికాబద్ధమైన విధాన ఆలోచనలు వారికి లేవన్నారు . ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రతికూల ప్రచారం మాత్రమే వారు చెయ్యగలరని, అంతకుమించి మరేమీ వారు చేయలేరని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

పొరపాటున వీరిని ఎన్నికల్లో గెలిపిస్తే సీఎం కుర్చీ తో కూడా మ్యూజికల్ చైర్స్ ఆడతారని విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక తన పోస్టు ద్వారా సీఎం కుర్చీ కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మ్యూజికల్ చైర్ ఆడతారు అన్న సంకేతాన్ని విజయసాయిరెడ్డి ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేశారు.
అంతకుముందు ఏపీలో రాజకీయాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఆయన ఎక్కడైనా కలుపుకుపోయే రాజకీయాలు కావాలి. ఒక్కో వర్గాన్ని దూరం చేసుకుంటూపోతే చివరకు ఎవరూ మిగలరు అంటూ పేర్కొన్నారు. మ్యానిప్యులేషన్లు, కుట్రలు, నోట్ల కట్టలతో ఒక చోటకు చేర్చిన రహస్య స్నేహితులు కూడా చెల్లాచెదరవుతారని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 'విజనరీ' అని బిరుదులు తగిలించుకున్న వారికి కొత్త ఆలోచనలు రావడం లేదా? అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.
ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళుతూ జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోస్తున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధికి ఇది చేస్తామని చెప్పలేకపోతున్నారని విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఇదిగో...దేశంలో ఎక్కడాలేని విధంగా కొత్త సంక్షేమ పథకాలు తీసుకొస్తాం. ప్రజల జీవితాలను ఇంతకంటే మెరుగుపరుస్తాం అని చెప్పుకోలేని పరిస్థితి టీడీపీ నాయకులదని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
అర్థం లేని ఆవేశాలు, వీరంగాలతో పైసా ప్రయోజనం ఉండదన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల సమస్యలు పరిష్కరించండి అంటూ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష పార్టీల నాయకులకు హితవు పలికారు. తన పోస్టుల ద్వారా రాష్ట్రంలో తాజాగా టీడీపీ, జనసేన ప్రచారాలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications