బిజెపి పొత్తు ట్విస్ట్: టిడిపితో లెక్క కుదరకుంటే తెరాసతో
హైదరాబాద్/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పొత్తులపై ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. బిజెపి, టిడిపిల పొత్తు పొడవకుంటే రంగంలో తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధంగా ఉందట. బిజెపి, టిడిపిల మధ్య పొత్తు అంశం చాలా రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. పొత్తు కుదిరినట్లే కనిపిస్తున్నప్పటికీ సీట్ల విషయానికి వచ్చేసరికి లెక్క తప్పుతోంది. దీంతో బిజెపి, టిడిపిల పొత్తు ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
బిజెపి, టిడిపిల పొత్తు చర్చలు కొనసాగుతుండగానే.. బిజెపితో తెరాస టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. బిజెపి సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్‌లతో తెరాస నేత వినోద్ కుమార్ చర్చలు జరుపుతున్నారట. టిడిపితో పొత్తు విషయం కొలిక్కి రాకుంటే తెలంగాణలో తెరాస, బిజెపి జట్టు కట్టే అవకాశాలున్నాయంటున్నారు.

టిడిపితో మొదటి నుండి చర్చలు జరుపుతున్నందునే తెరాసతో పొత్తుపై బిజెపి నిరీక్షిస్తోందని లేదంటే తెరాసతో ఖాయమై పోయేదంటున్నారు. తాము కోరినన్ని సీట్లు టిడిపి ఇవ్వకుంటే బిజెపి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. తెరాసతో పొత్తు పెట్టుకుంటే కొన్ని తక్కువ సీట్లు కేటాయించినా.. ఇరు పార్టీలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసినందున ఎక్కువ సీట్లు గెలిచే అవకాశముందని బిజెపి భావిస్తోంది.
అదే సమయంలో తెరాస కూడా ఏదో ఒక పార్టీతో జట్టుకట్టకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని భావిస్తోందట. ఇప్పటికే కాంగ్రెసు, తెరాస కలిసి నడిచేందుకు సిద్ధమయ్యాయి. తాము ఒంటరిగా వెళ్తే ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున బిజెపి లేదా కాంగ్రెసుతో వెళ్తే బావుంటుందని భావిస్తున్నారట. అయితే, తెరాస ఎక్కువగా బిజెపి వైపు మొగ్గు చూపుతోందట. అయితే, టిడిపితో పొత్తు చర్చల నేపథ్యంలో నిరీక్షిస్తున్నారంటున్నారు. అయితే, తెరాసతో పొత్తుల గురించి చర్చలు జరగడం లేదని ప్రకాశ్ జవదేకర్ చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications