పీకే ఎంట్రీతో సీన్ మారుతోందా - "చంద్ర" వ్యూహం, జగన్ ధైర్యం ఏంటి..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జగన్ తిరిగి గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. చంద్రాబు, పవన్ ఎలాగైనా పవన్ ను ఓడించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. జగన్ ను ఓడించేందుకు అందరినీ చంద్రబాబు కూడగడుతున్నారు. తాజాగా..నాడు జగన్ గెలుపులో కీలకంగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ తోనూ మంత్రాంగం ప్రారంభించారు. మరి..చంద్ర బంధంలో జగన్ చిక్కుకుంటారా. ఏం జరుగుతోంది.
కొత్త రాజకీయం : ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. జగన్ ను ఓడించేందుకు చంద్ర దండు సిద్దమైంది. ఎలాగైనా అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో పొత్తు ఖాయం చేసుకున్న చంద్రబాబు..ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించారు. అటు బీజేపీతోనూ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ కు పోటీగా సంక్షేమ పథకాలు ప్రారంభించారు తమ పార్టీ నేతలకు సీట్లు తగ్గినా..ముందు అధికారం కోసం మిత్రపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతీ సందర్భంలో త్యాగాలకు సిద్దం కావాలంటూ పిలుపునిస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చంద్రబాబు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

చంద్రబాబు వ్యూహాలు : పవన్ కల్యాణ్ తో పొత్తుతో గోదావరి జిల్లాల్లో పై చేయి సాధించాలనేది చంద్రబాబు వ్యూహం. జనసేనకు ఆ రెండు జిల్లాల్లోనే మెజార్టీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇక..అర్బన్ ప్రాంతంలో వైసీపీ పైన కొన్ని వర్గాల్లో ఉన్న ప్రతికూల అంశాలను తమకు అనుకూలగా మలచుకోవాలని భావిస్తున్నారు. ఇక, జగన్ కు కంచుకోటగా ఉన్న రాయలసీమ, గ్రామీణ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో మంత్రాంగం ప్రారంభించారు. తాజాగా చంద్రబాబు - ప్రశాంత్ కిషోర్ భేటీలో కీలక చర్చ జరిగింది. ప్రచారం - పథకాల పైన ప్రశాంత్ కిషోర్ పలు సూచనలు అందించారు. జగన్ బలం - బలహీనత గురించి అవగాహన ఉన్న ప్రశాంత్ కిషర్ సలహాలు తమకు కలిసి వస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా పవన్ కల్యాణ్, ప్రశాంత్ కిషోర్ తో పాటుగా మరి కొందరి తెర వెనుక మద్దతుతో చంద్రబాబు ఎన్నికల బరిలో దిగుతున్నారు.

జగన్ ధైర్యం ఇదేనా : ఇటు జగన్ ఎంత మంది కలిసి వచ్చినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని ప్రకటించారు. పొత్తులు, చంద్రబాబు ఎత్తులు గమనించి అవసరమైన నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల మార్పు ప్రారంభించారు. సంక్షేమం - సామాజిక న్యాయం అమలు చేస్తూ ఓట్ బ్యాంక్ పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల తరువాత జగన్ తో దూరంగా ఉంటున్నారు. ఐ -ప్యాక్ తోనూ ప్రశాంత్ కిషోర్ కు సంబంధాలు లేవు. ఐ -ప్యాక్ రుషి రాజ్ సింగ్ టీం ప్రస్తుతం వైసీపీకి సపోర్ట్ చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీడీపీ గెలుపు కోసం రంగంలోకి దిగినా నష్టం లేదని వైసీపీ వాదిస్తోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అన్ని రకాలుగా వైసీపీ ఆధిక్యత కొనసాగుతుందని చెబుతున్నారు. ఏపీలో ఈ సారి రాజకీయ కొత్త రూపు తీసుకుందని..జగన్ కేంద్రంగానే ఎన్నికలు జరుగతాయని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications