తొలిదశలో 400 ఐటి కంపెనీలు: కెటిఆర్, ప్రపంచ ఫార్మాసిటీగా రాజధాని
హైదరాబాద్: రానున్న శాసనసభ సమావేశాల్లో ఐటి పాలసీని ప్రవేశపెడతామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటిలో శుక్రవారం తెలంగాణ హబ్‌కు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ.. ఐటి పాలసీ ముసాయిదా తయారు చేశామని చెప్పారు.
జూన్ 2లోపు మొదటి దశ తెలంగాణ హబ్ పనులు పూర్తవుతాయని తెలిపారు. మొదటి దశలో 400 కంపెనీలలో 3వేల మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని చెప్పారు. 2018లో జరిగే ఐటి కాంగ్రెస్ నాటికి ఐటి హబ్ రెండో దశ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రెండో దశలో సుమారు 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.
ఇండియన్ ఫార్మాన్యూటికల్ సదస్సు ప్రారంభం

హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి ఫార్మాసిటీ కానుందని మంత్రి కె తారక రామారావు అన్నారు. శుక్రవారం హైటెక్స్‌లో 66వ ఇండియన్ ఫార్మాన్యూటికల్ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా 66వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 33శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఎగుమతి అవుతున్నాయని అన్నారు.
విమానాశ్రయ సమీపంలోని ముచ్చెర్ల వద్ద ఫార్మాసిటీ నెలకొల్పుతున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీ కోసం ముఖ్యమంత్రి 11వేల ఎకరాలు కేటాయించారన్నారు. ఉద్యోగుల కోసం స్మార్ట్ సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ఫార్మా పరిశ్రమ కోసం పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికారు. వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, పారిశ్రామిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications