ఆ విమానం బంగాళాఖాతంలో పడిందా: విశాఖలో బాబు పరామర్శ

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: అదృశ్యమైన ఏఎన్ 32 విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమానంలో గల్లంతైన 29 మందిలో ఎనిమిది మంది విశాఖ వాసులు ఉన్నారు. విశాఖవాసుల కుటుంబాలను సీఎం చంద్రబాబు శనివారం పరామర్శించారు. గల్లంతైన ఎన్‌ఏడీ సిబ్బంది జాడ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విశాఖలోని బుచ్చిరాజుపాలెంలో ఉంటున్న నమ్మి చిన్నారావు కుటుంబాన్ని కలిశారు. ఆ సమయంలో... తమ వాడ్ని వెంటనే తీసుకు రావాలని చంద్రబాబును ఆ కుటుంబం ప్రాధేయపడింది.

ప్రభుత్వం ఆ పనిమీదే ఉందని, అధైర్యపడొద్దని, కేంద్రం నుంచి పౌర విమానయాన మంత్రి అశోక గజపతిరాజుతో పాటు రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ కూడా వస్తున్నారన్నారు. సిబ్బంది ఆచూకీ తెలియగానే సమాచారం అందిస్తామన్నారు. అంతవరకు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌ అండగా ఉంటారన్నారు.

బాజీ కూడలి ప్రాంతంలో ఉన్న ఎన్‌ఏడీ ఉద్యోగి పాటి నాగేంద్ర కుటుంబాన్నీ సీఎం పరామర్శించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మీడియావారిని ఆ ఇంటి దగ్గరకు అనుమతించలేదు. పరామర్శ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. కాగా, విమానం బంగాళా ఖాతంలో పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఈ కుటుంబాల్ని చూస్తే బాధ వేస్తోందని, నేను పరామర్శించినవి రెండూ నిరుపేద కుటుంబాలేనని, నాగేంద్ర తండ్రి పకోడీలు వేసి అతన్ని చదివించి ఉద్యోగం వచ్చే విధంగా చేశారని చంద్రబాబు విమానం గల్లంతైనప్పటి నుంచి ఈ కుటుంబాలు ఆవేదనతో ఉన్నాయన్నారు. ఈ కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

మనోహర్ పారికర్

మనోహర్ పారికర్

గల్లంతైన వైమానిక దళ విమానం ఆచూకీ రెండు రోజులైనా తెలియలేదు. దీంతో గల్లంతైన 29 మంది బంధువుల్లో ఆందోళన పెరిగిపోతోంది. నౌకా దళం, తీర రక్షక దళానికి చెందిన 18 నౌకలు, ఎనిమిది విమానాలతో బంగాళాఖాతంలో విస్తృతంగా గాలిస్తున్నా.. ఫలితం కనిపించలేదు. ప్రతికూల వాతావరణం వల్ల గాలింపు చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

విమానం

విమానం

మరోపక్క పరిస్థితిని పర్యవేక్షించడానికి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ చెన్నై వచ్చారు. బలమైన ఈదురుగాలుల వల్ల గాలింపు సవ్యంగా సాగడం లేదని రక్షణవర్గాలు చెప్పాయి. దీనికితోడు సాగర ఉపరితలంపై మేఘావృతమై ఉండటంతో ఏవీ స్పష్టంగా కనిపించడం లేదు. గాలింపు ప్రదేశంలో సముద్రం లోతు ఏకంగా 3,500 మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. జలాంతర్గాములు 350 మీటర్ల లోతులోనే ప్రయాణిస్తాయి. డైవర్లు 80 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో మునిగిపోయిన విమానంలో ఉండే ఎమర్జెన్సీ లోకేటర్‌ ట్రాన్సిమిటర్ నుంచి జలాంతర్గామికి ఏమైనా సంకేతాలు అందుతాయేమోనని ఎదురుచూస్తున్నారు.

 విమానం

విమానం

గాలింపు చర్యలను పర్యవేక్షించడానికి తూర్పునౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ హెచ్‌సిఎస్‌ బిస్త్‌ విశాఖ నుంచి వెళ్లారు. రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ తాంబరంలోని వైమానిక స్థావరంలో అధికారులతో సమావేశమై గాలింపు చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అరక్కోణంలోని నౌకా స్థావరం నుంచి పి-8ఐ విమానంలో వెళ్లి, గాలింపు ఆపరేషన్‌ను స్వయంగా పరిశీలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian Air Force plane with 29 on board missing in Bay of Bengal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి