ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
ఏపీలో వాతావరణ పరిస్థితులు చిత్రంగా ఉంటున్నాయి. ఓవైపు ఎండలు మండిస్తుంటే మరోవైపు వానలు కురుస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతోపాటు తీవ్ర వడగాడ్పులకు గురైన ప్రజలు ప్రస్తుతం కురుస్తున్న వానలతో కాస్తంత ఉపశమనం దొరికింది. ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడు మీదగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గురువారం, శుక్రవారం రెండురోజులు తేలికపాటి వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, అనకాపల్లి, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కర్నూలు, నంద్యాల, కాకినాడ, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంలోని కొన్ని మండలాల్లో వేడి గాలులు వీస్తాయని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. బుధవారం తూర్పుగోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనంతపురం, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లా, కడప జిల్లాల్లో వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
రాజమండ్రిలో 114.2 మిలీమీటర్లు, ప్రకాశం జిల్లా మద్దిపాడులో 130.6 మిలీమీటర్ల వాన పడింది. ముందు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ తర్వాత వాతావరణం మారిపోయింది. గంటకు పైగా కుంభవృష్టి కురిసింది. దీంతో ప్రజలు కాస్తంత ఉపశమనం పొందారు.












Click it and Unblock the Notifications