విజయవాడ, విశాఖ వెళ్లే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
దేశంలో మారుతున్న పరిస్దితులకు అనుగుణంగా రైల్వేల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న కేంద్రం.. ఇవాళ మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే వందే భారత్, అమృత్ భారత్ వంటి కొంగొత్త రైళ్లను పట్టాలపై పరుగులు తీయిస్తున్న కేంద్రం.. మరోవైపు రైల్వే స్టేషన్లను కూడా వివిధ పథకాల ద్వారా అభివృద్ధి చేస్తోంది. అలాగే స్టేషన్లకు వచ్చే ప్రయాణికులకు అందించే సదుపాయాలనూ పెంచుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఏపీలోని విశాఖ, విజయవాడ స్టేషన్లతో పాటు భువనేశ్వర్, బెంగళూరు రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణికులకు బయటి రెస్టారెంట్ల నుంచి ఆహారం పంపిణీ చేసేందుకు వీలుగా ఫుడ్ డెలివరీ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ స్విగ్గీతో రైల్వే కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆయా రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు స్ధానికంగా ఉన్న రెస్టారెంట్ల నుంచి నేరుగా ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఆన్ లైన్ లో చెల్లింపులు చేయడం ద్వారా ఆర్డర్ చేసుకునే అవకాశం ఇచ్చారు.

ఈ నెల 12వ తేదీ నుంచి మన రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఇలా స్విగ్గీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇలా ఫుడ్ ఆర్డర్ చేసేందుకు స్విగ్గీ యాప్ కాకుండా ఐఆర్సీటీసీ యాప్ ను వినియోగించాల్సి ఉంటుంది. యాప్ లో తమ పీఎన్ఆర్ నంబర్ ను ఎంటర్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో తమకు ఫుడ్ డెలివరీ కావాల్సిన రైల్వే స్టేషన్ ను సూచిస్తే అక్కడికే ఫుడ్ నేరుగా అందుతుంది. ప్రస్తుతానికి నాలుగు రైల్వే స్టేషన్లలో ప్రారంభమవుతున్న స్విగ్గీ సేవల్ని భవిష్యత్తులో 59 స్టేషన్లకు విస్తరించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications