బెజవాడ దుర్గమ్మ జలవిహారం చేసే హంస వాహనసేవ రద్దు.. ఎందుకంటే
అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ బెజవాడ దుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు శనివారంతో ముగియనున్నాయి. ఈసారి ఏపీ ప్రభుత్వం బెజవాడ దుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలు ఎలాంటి లోపాలు లేకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వహిస్తుంది.
దుర్గమ్మ హంస వాహన సేవ రద్దు
ఈ నేపథ్యంలో చివరి రోజు నిర్వహించే దుర్గమ్మ వారి హంస వాహన సేవను ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. అత్యంత ఘనంగా అమ్మవారి జలవిహారానికి చేసే హంస వాహన సేవ రద్దు కావడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

కృష్ణా నదిలో ఉధృతంగా ప్రవాహం .. అందుకే
కృష్ణా నదిలో నీటి ప్రవాహ స్థాయి అధికంగా ఉండటం వలన అమ్మవారి జలవిహారాన్ని రద్దు చేశారు. కృష్ణా నదిలో ఇంకా వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 40 క్యూసెకుల వరద నీరు నదిలో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మ వారి జల విహారాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
అమ్మవారి జలవిహారం రద్దుతో భక్తుల నిరాశ
అయితే బెజవాడ దుర్గమ్మ హంస వాహనంపై చేసే జల విహారం చాలా ప్రత్యేకం. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించటం కోసం తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇతర ప్రాంతాల నుండి దుర్గమ్మ భక్తులు భారీ సంఖ్యలో విజయవాడకు తరలి వస్తారు. ఈ సంవత్సరం కృష్ణా నదిలో ఇంకా వరద ఉధృతి కొనసాగుతున్న నేపధ్యంలో అమ్మవారి జలవిహారం రద్దు చేయటం భక్తులను కాస్త నిరాశకు గురి చేసింది.
నేడు మహిషాసురమర్ధిని రూపంలో దుర్గమ్మ
ఇదిలా ఉంటే అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైన బెజవాడ దుర్గమ్మ శరన్నవరాత్రులు శనివారంతో ముగియనున్నాయి. ఈ తొమ్మిది రోజులు బెజవాడ కనకదుర్గమ్మ వివిధ అలంకరాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు దుర్గాదేవి మహిషాసురమర్ధిని రూపంలో భక్తులను కటాక్షిస్తున్నారు.రేపు విజయదశమి శనివారం శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి రూపంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
రేపు విజయ దశమి సందర్భంగా , అలాగే నవరాత్రులలో చివరిరోజు కావటంతో భక్తులు కనకదుర్గ ఆలయానికి పోటెత్తుతున్నారు. దేవీ శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా భక్తుల సౌకర్యాలు, ప్రసాదాల విషయంలో ఆలయ అధికారులు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆలయ పవిత్రతను కాపాడే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications