టార్చ్‌లైట్ వెలుగులోనే వైద్యం! పరాకాష్టకు చేరిన నిర్లక్ష్యం..
ప్రభుత్వాల తొందరపాటు నిర్ణయాలకు, అధికారుల అరకొర ఏర్పాట్లకు నిదర్శనంగా నిలిచింది పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆ ఘోరం. నాణ్యమైన వైద్యాన్ని గిరిజనుల గుమ్మముందుకే తెచ్చామంటూ ఆర్భాటంగా ప్రారంభించిన ఆ నూతన వైద్యాలయం, నేడు కనీస వెలుగులు లేక చీకటి కూపంగా మారింది. మౌలిక వసతులు సున్నా.. కానీ రిబ్బన్ కటింగ్ మాత్రం పూర్తి! ప్రారంభోత్సవాల మీద ఉన్న శ్రద్ధ, ప్రజల ప్రాణాలపై లేకపోవడంతో గిరిజన గ్రామాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం, గుమ్మలక్ష్మీపురంలో ఇప్పుడే అందుబాటులోకి తెచ్చిన సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. భవనం మెరిసిపోతున్నా, లోపల డ్రైనేజీ వ్యవస్థ, ఉపయోగపడే బాత్రూంలు, తాగడానికి మంచినీటి సదుపాయం కూడా లేకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

ఈ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. వేడి నీళ్లు పడి శరీరం కాలిన గాయాలతో ఓ ఐదేళ్ల పసివాడు విలవిలలాడుతూ ఆస్పత్రికి వచ్చాడు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రి మొత్తం చీకటిమయమైంది. కనీసం అత్యవసర సమయంలో వాడటానికి జనరేటర్ కూడా అందుబాటులో లేకపోవడంతో, విధిలేని పరిస్థితుల్లో వైద్యులు సెల్ ఫోన్ టార్చ్‌లైట్ల వెలుగులోనే ఆ బాలుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.
పబ్లిసిటీ పిచ్చి - పసివాడికి నరకం
వసతులు పూర్తికాకుండానే ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించారంటూ గిరిజన సంఘాలు, ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రచార ఆర్భాటం కోసం పనులు పూర్తి కాకుండానే మంత్రి, ఎమ్మెల్యేలు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వైసీపీ నేత పుష్పశ్రీవాణి.విద్యుత్తు జనరేటర్ లేకుండా ఆస్పత్రిని ఎవరనైనా ప్రారంభిస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం మాని, వెంటనే ఆస్పత్రిలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్ సౌకర్యం కల్పించాలని, మంచినీరు, పారిశుద్ధ్య పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు టార్చ్‌లైట్ల వెలుగులో చికిత్స చేసే దుస్థితి తెచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.














Click it and Unblock the Notifications