10లక్షల రూపాయల భీమా.. ఇది చంద్రబాబు సర్కార్ వారికిచ్చిన ధీమా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏపీలో అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్న ప్రభుత్వం ముఖ్యంగా సేకరణ విషయంలో కూడా వారి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేయడంతోపాటు, కీలకనిర్ణయం తీసుకుంటుంది. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు ఎదుర్కొనే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వ నిర్ణయం
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ప్రమాదంలో మృతి చెందిన మత్స్యకారులకు అందించే బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సముద్ర వేట మత్స్యకారులకు ఉపాధి అయినప్పటికీ, అది అత్యంత ప్రమాదకరమైన వృత్తుల్లో ఒకటి కావడంతో వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సముద్రంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న మత్స్యకారులు
వాతావరణ మార్పులు, తుఫానులు, సాంకేతిక లోపాలు వంటి అనేక కారణాలతో ప్రతీ ఏడాది పలువురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినప్పుడు వారి జీవితం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడుతోంది. ఈ నేపథ్యంలో బీమా మొత్తాన్ని భారీగా పెంచడం ద్వారా మృతుల కుటుంబాలకు బలమైన ఆర్థిక మద్దతు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మత్స్యకార కుటుంబాలకు ఆర్ధిక భరోసా
పెంచిన బీమా మొత్తంతో మత్స్యకార కుటుంబాలు కొంతమేర ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుల భారాన్ని తగ్గించుకోవడం, పిల్లల చదువులు కొనసాగించడం, జీవనాధారం ఏర్పరుచుకోవడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం మత్స్యకారుల్లో భరోసాను పెంచడమే కాకుండా, ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని మరింత బలపరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పదిలక్షల రూపాయల బీమాతో మత్స్యకారులకు ధీమా
మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంధన సబ్సిడీలు, వేట పరికరాలపై సహాయం, ఆధునిక పడవల ప్రోత్సాహం వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. తాజాగా ప్రధానమంత్రి మధ్య సంపద యోజన పథకంలో ఇచ్చే 2లక్షల తో పాటు, మరో ఎనిమిది లక్షలు చేర్చి పదిలక్షల రూపాయలకు బీమా పెంపు నిర్ణయం ఈ క్రమంలో మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. మత్స్యకారుల జీవన భద్రతకు ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రాధాన్యత మత్స్యకార కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు .












Click it and Unblock the Notifications