చంద్రబాబుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట !
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న చంద్రబాబుకు ఇవాళ మరో గుడ్ న్యూస్ లభించింది. ఇవాళ అంగళ్లు కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా.. సుప్రీంకోర్టులో మరో కేసులో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడగా.. ఫైబర్ నెట్ కేసులో తాత్కాలిక ఊరట లభించింది.
ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో చంద్రబాబు ముందస్తు పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు లో మధ్యాహ్నం వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించారు. తన క్లయింట్ చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని ప్రభుత్వం వరుస కేసులు పెడుతోందని ఆరోపించారు. సెక్షన్ 17ఏ ఈ కేసుకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

అదే సమయంలో విజయవాడ ఏసీబీ కోర్టు సీఐడీ వినతి మేరకు ఈ కేసులో చంద్రబాబును పీటీ వారెంట్ కు ఇస్తూ ఇచ్చిన ఆదేశాల్ని లూథ్రా ప్రస్తావించారు. సోమవారం ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును ఫైబర్ నెట్ కేసులనూ సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని సుప్రీం కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు వచ్చే బుధవారం వరకూ చంద్రబాబును ఈ కేసులో సీఐడీ అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
అలాగే ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అటు ప్రభుత్వం కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో వచ్చే మంగళవారం ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications