భవిష్యత్ కు గ్యారెంటీ బస్సుయాత్ర సాక్షిగా.. టీడీపీలో విబేధాలు; మడకశిరలో యాత్రకు బ్రేక్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని టిడిపి, అధికారంలోకి రావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో హోరాహోరీగా ఇరుపార్టీల నేతలు రకరకాల కార్యక్రమాలతో ప్రజల మద్దతు కోసం ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ బస్సు యాత్ర టిడిపిలో ఉన్న వర్గ విభేదాలను రోడ్డుకెక్కిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీడీపీ బస్సు యాత్రలో టిడిపి నేతల మధ్య వర్గ విభేదాలు పార్టీ పరువును తీస్తున్నాయి. ఇప్పటికే పెనుగొండలో తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరు కొట్టుకోగా మడకశిర లో ఏకంగా యాత్రను వాయిదా వేసిన పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య తారాస్థాయికి గొడవలు జరగటం, బస్సు యాత్ర సాక్షిగా తెలుగు తమ్ముళ్లు ముష్టి యుద్ధాలకు దిగటం తెలుగు దేశం పార్టీని గందరగోళానికి గురి చేస్తుంది. తాజాగా సత్యసాయి జిల్లా పెనుగొండ టిడిపిలో సవితమ్మ, బీకే పార్థసారథి వర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకోగా, ఇక మడకశిర లోనూ సీనియర్లు జూనియర్లు మధ్య ఆధిపత్యపోరు రచ్చగా మారింది.
రేపు జరగాల్సిన టిడిపి బస్సు యాత్ర మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం, గుండుమల తిప్పేస్వామి వర్గీయుల అంతర్గత పోరు నేపద్యంలో వాయిదా పడింది. మడకశిర లో బస్సు యాత్ర వాయిదా వేసి అక్కడ జరగాల్సిన బస్సు యాత్రను కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మార్చారు.మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గ యాత్రలో పాల్గొంటే తాము యాత్రలో పాల్గొనేది లేదని గుండుమల తిప్పేస్వామి వర్గీయులు తెగేసి చెప్పారు.
వాట్సప్ వేదికగా ఈ రెండు వర్గాల మధ్య రచ్చ కొనసాగింది. దీంతో మళ్లీ మడకశిర లోనూ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు రోడ్డుకెక్కుతాయి అని ఆందోళన చెందిన టీడీపీ అధిష్టానం అక్కడ యాత్రను వాయిదా వేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రేపు బస్సు యాత్రను కొనసాగించాలని నిర్ణయించింది. మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికల కోసం రెడీ అవుతున్న తెలుగుదేశం పార్టీకి పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు, బస్సు యాత్రల సాక్షిగా బహిర్గతం కావడం ఆందోళన కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications