విజయవాడ నుంచి న్యూయార్క్‌కి డైరెక్ట్ ప్లైట్..!!
ఏపీలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటుతో పాటుగా ప్రముఖ నగరాలకు సర్వీసులను పెంచేలా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కొత్తగా ఏడు విమానాశ్రయాలు ఏపీలో అందుబాటు లోకి తెస్తామని చెప్పారు. అదే సమయంలో గన్నవరం నుంచి నేరుగా న్యూయార్క్ కు విమాన సర్వీసుల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. తాజాగా జరిగిన ఏయిర్ పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదన పైన చర్చించారు.
తిరుపతి నుంచి కొత్త సర్వీసులు
ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు పై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. త్వరలోనే నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు కానున్నట్లు వివరించారు. ఇందుకోసం స్థలాలను పరిశీలించి కొత్త ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. గతంలో దేశవ్యాప్తంగా 74 విమానాశ్రయాలు ఉండేవన్న రామ్మోహన్ నాయుడు.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సంఖ్య 157కు చేరిందన్నారు. తిరుపతి - ఢిల్లీ ఇండిగో విమానం సర్వీసు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.

కొత్త విమానాశ్రయాలు
తిరుపతి నుంచి దేశ రాజధాని ఢిల్లీ మధ్య భక్తుల సౌకర్యం కోసం నేరుగా విమాన సర్వీసును ప్రారంభిచామని చెప్పారు. అదే విధంగా త్వరలో ముంబై, కోయంబత్తూరు, కలకత్తా నుంచి తిరుపతికి డైరెక్ట్ విమాన సర్వీసులు కావాలని డిమాండ్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులను మరింత అభివృద్ధి చేసేందుకు, మరిన్ని సర్వీసులు నడిపేందుకు చర్యలు ఉంటాయని చెప్పారు. తిరుపతి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెంచుతామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, పుట్టపర్తి సహా ఏడుచోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
2029 నాటికి నేరుగా
మరో వైపు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనల పైన చర్చ జరిగింది. అందులో బాగంగా 2029 నాటి కల్లా విజయవాడ నుంచి న్యూయార్క్‌కి డైరెక్ట్ ప్లైట్ ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఎంపీ బాలశౌరి వెల్లడించారు. వారణాసి, కొచ్చి సహా దేశం లోని ఇతర ప్రాంతాలకు, అంతర్జాతీయ విమాన సర్వీసులు పెంపుకి సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరిపామని తెలిపారు.












Click it and Unblock the Notifications