"యుద్ద చరిత్ర తిరగరాసిన ఇరాన్"-జనసేన నేత ప్రశంసలు..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దానికి నిన్న అనూహ్య పరిణామాల మధ్య తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకరించాయి. ఈ యుద్దంలో ఇరాన్ అమెరికా ఆధిపత్యానికి, అహంకారానికి గండికొట్టడం ద్వారా తన సత్తా చాటుకుంది. చివరికి యుద్దంలో నుంచి బయటపడేందుకు ట్రంప్ తప్పనిసరై కాల్పుల విరమణ ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో యుద్దంలో ఇరాన్ పోరాటపటిమపై జనసేన నేత ఒకరు ప్రశంసలు కురిపించారు.
యుద్ధ చరిత్రను తిరగరాసిన ఇరాన్..దేశ రక్షణకు ఐక్యతే అసలైన వజ్రాయుధం! అని నిరూపించిందంటూ జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ (bolisetty satyanarayana) ప్రశంసించారు. ఇవాళ చేసిన ట్వీట్ లో ఆయన.. 2026లో ప్రపంచ అగ్రరాజ్యాలు జరిపిన మెరుపు దాడులను ఇరాన్ ఎదుర్కొన్న తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. 40 రోజుల పాటు సాగిన ఈ పోరాటంలో ఆ దేశం ప్రదర్శించిన ధైర్యసాహసాలు చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా నిలిచిపోతాయన్నారు. భారీ వైమానిక దాడులు జరిగినప్పటికీ, క్షిపణులు, డ్రోన్ల సహాయంతో ఇరాన్ అచంచలమైన పట్టుదలతో దీటుగా స్పందించిందన్నారు.

యుద్ధ చరిత్రను తిరగరాసిన ఇరాన్..
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) April 9, 2026
దేశ రక్షణకు ఐక్యతే అసలైన వజ్రాయుధం!
2026లో ప్రపంచ అగ్రరాజ్యాలు జరిపిన మెరుపు దాడులను ఇరాన్ ఎదుర్కొన్న తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 40 రోజుల పాటు సాగిన ఈ పోరాటంలో ఆ దేశం ప్రదర్శించిన ధైర్యసాహసాలు చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా…
హార్ముజ్ జలసంధిలో రవాణాను అడ్డుకోవడం ద్వారా, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగేలా చేసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంలో ఆ దేశం విజయం సాధించిందని బొలిశెట్టి తెలిపారు. చివరికి తన సొంత నిబంధనలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా, అగ్రరాజ్యాల ముందు తన ఉనికిని మరియు శక్తిని చాటుకుందన్నారు. ఈ యుద్ధం ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే.. ఏ దేశానికైనా ఆయుధ సంపత్తి కంటే పౌరుల ఐక్యత మరియు దేశభక్తి అత్యంత ముఖ్యం అని తెలిపారు. క్లిష్ట సమయాల్లో ప్రజలందరూ ఏకతాటిపై నిలబడినప్పుడే దేశ భద్రత సాధ్యమవుతుందన్నారు. అది ఎంతటి మహాశక్తినైనా ఎదిరించే బలాన్ని ఇస్తుందని బొలిశెట్టి తెలిపారు.












Click it and Unblock the Notifications