వారణాసి, అయోధ్య సహా ప్రముఖ క్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు - ప్యాకేజీలు, షెడ్యూల్..!!
పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఉత్తరాది, దక్షిణాదితో పాటుగా పలు ప్రఖ్యాత ఆలయాల సందర్శనకు వీలుగా ప్యాకేజీలు ఖరారు చేసింది. భారత్ గౌరవ్ టూరిస్టు రైల్ పేరుతో ఈ నెల 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు ఈ ప్యాకేజీలను అమలు చేస్తోంది. నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ నుంచి వీటిని ప్రారంభించనుంది. ఈ రైళ్లకు సంబంధించిన ప్యాకేజీలు.. రూట్.. షెడ్యూల్ ను అధికారికంగా వెల్లడించారు.
ప్రత్యేక ప్యాకేజీలు
తక్కువ బడ్జెట్ ఖర్చుతోనే ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించే వీలుగా రైల్వే శాఖ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ప్రముఖ పుణ్య క్షేత్రాల దర్శనం కోసం నాలుగు ప్యాకేజీలను ప్రకటించింది.ఏప్రిల్ 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు 4 ప్యాకేజీలుగా వీటిని హైదరాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఇందులో రైలు ప్రయాణంతో పాటు బస్ ప్రయాణం, భోజనం వసతి, హోటల్, సైట్ సీయింగ్, గైడ్ సర్వీస్ వంటివి మనం చెల్లించే ఛార్జీల్లో కలిపి ఉంటుంది. ప్రతి రైల్లో 712 మంది ప్రయాణికులు, 70 మందికి ఇద్దరు సమన్వయకర్తలు ఉంటారు.

ఉత్తరాది క్షేత్రాలు
ఈ ప్యాకేజీల్లో టికెట్ బుక్ చేసుకున్న వారు యాత్రకు 15 రోజుల ముందు రూ.250 రుసుముతో టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు. తమ స్థానంలో కుటుంబ సభ్యులను పంపించే వెసులుబాటు కూడా ఉంటుంది. ప్యాకేజీ 1 లో భాగంగా రుషికేశ్, హరిద్వార్, నైనాదేవి, ఆనంద్‌పూర్, అమృత్‌సర్, మాతా వైష్ణోదేవి యాత్ర. ఒకరికి సాధారణ టికెట్ ధర రూ.18,510, మూడో శ్రేణి ఏసీ రూ.30,700, రెండో శ్రేణి ఏసీ రూ.40,685 గా నిర్ణయించారు. ఏప్రిల్ 23న ఈ యాత్ర ప్రారంభమై మే2 న ముగుస్తుంది. అదే విధంగా ప్యాకేజీ 2 లో పూరి, గయా, కోనార్క్, వారణాసి, అయోధ్య, (సరస్వతి పుష్కరాలు), ప్రయాగ్‌రాజ్. ఒకరికి సాధారణ టిక్కెట్ ధర రూ.16,800. మూడో శ్రేణి ఏసీ రూ.26,600, రెండో శ్రేణి ఏసీ రూ.34,900 గా ఖరారు చేసారు.
దక్షిణాది యాత్రలో
ఈ రెండో ప్యాకేజీ యాత్ర మే 8న ప్రారంభమై మే 17న ముగుస్తుంది. ఇక, ప్యాకేజీ -3 లో భాగంగా అరుణాచలం, మధురై, రామేశ్వరం, త్రివేండ్రం, తిరుచ్చి, కన్యాకుమారి, తంజా వూర్. ఒకరికి టికెట్ ధర రూ.14,700. రెండు, మూడో శ్రేణి ఏసీ రూ.22,900 గా ఉంది. ఈ యాత్రం మే 22న మొదలై మే 30న పూర్తవుతుంది. ప్యాకేజీ -4 లో ఓంకారేశ్వరం, మహాకాళేశ్వరం, భీమశంకరం, త్రయంబకేశ్వరం, గృష్ణేశ్వర, ఎల్లోరా, ఎంహెచ్‌డబ్ల్యూ, నాగపూర్. ఒకరికి సాధారణ టిక్కెట్ ధర రూ.14,700. రెండు, మూడో శ్రేణి ఏసీ రూ.22,900 ఉంటుంది. ఈ యాత్ర జూన్ 4న మొదలై.. జూన్ 12 తో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications