కాపుల్ని బాబు అవమానించారు: వీర్రాజు, పవన్ కళ్యాణ్ వర్గం నుంచి బిజెపి ప్లాన్!
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం నాడు మరోసారి ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీకి విజయాన్ని కట్టబెట్టిన కాపులను చంద్రబాబు అవమానించారన్నారు.
ఎన్నికల సమయంలో కాపులకు తెలుగుదేశం ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. కాపుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తొలి విడతలోనే రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, ఎన్నికలు ముగిసి టీడీపీ అధికారంలోకి వచ్చి, బాబు సీఎం అయ్యారు.
ఇచ్చిన హామీ మేరకు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు దానికి రూ.50 కోట్లను విడుదల చేశారు. ఈ అంశాన్ని సోము వీర్రాజు ప్రస్తావించారు. కాపులకు రూ.50 కోట్లు కేటాయించి సదరు సామాజిక వర్గాన్ని చంద్రబాబు అవమానించారన్నారు.

ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాపులు పెద్ద ఎత్తున ఆందోళనలకు సన్నాహాలు చేస్తున్నారని హెచ్చరించారు. అదే జరిగితే చంద్రబాబు విపత్కర పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్నారు.
కాపుల సమస్యలను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలికారు. ఇది కూడా టిడిపి అధికారంలోకి వచ్చేందుకు సహకరించింది. ఈ నేపథ్యంలో బిజెపి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం నుంచి టిడిపిని నరుక్కొచ్చే పని ప్రారంభించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications