జగన్ ఆ ఒక్క అడుగేస్తే ? ఎదురుచూస్తున్న బీజేపీ! చంద్రబాబుకు అనుకూలంగా గేమ్ మార్చేసే ప్లాన్ ?
వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పుణ్యమాని ఏపీలో రాజకీయాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఏపీలో రెండేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీ పోషిస్తున్న పాత్ర.. అధికార వైసీపీని చికాకు పెడుతోంది. అంతే కాదు జగన్ కు అండగా ఉన్నట్లు నటిస్తూనే బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే .. ఇక జగన్ ఏదో ఒకటి తేల్చుకునేలా పురికొల్పుతున్నట్లే కనిపిస్తోంది. అదే జరిగితే మధ్యలో చంద్రబాబు మళ్లీ ఫామ్ లోకి రావడం ఖాయంగా తెలుస్తోంది.

రసవత్తరంగా ఏపీ రాజకీయం
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉంది. ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైనా ముందడుగు మాత్రం పడటం లేదు. ముందస్తుకు వెళ్లేది లేదంటూ వైసీపీ ఇచ్చిన సంకేతాలే ఇందుకు కారణం. అయితే ఆ లోపే రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలే. తెలంగాణలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకోసం గతంలో మిత్రుడిగా ఉండి ఆ తర్వాత శత్రువుగా మారి తిరిగి మిత్రుడవ్వాలన్న ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబును తిరిగి అక్కున్న చేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఏపీలో రాజకీయానికి డిసైడర్ గా మారుతున్నాయి.

బీజేపీ అనూహ్య ఎత్తుగడలు
తెలంగాణలో తొలిసారి అధికారం అందుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు దేనికైనా సిద్ధమేనంటోంది. ఇందులో భాగంగా కేసీఆర్ కుమార్తెను లిక్కర్ స్కాంలో జైలుకు పంపేందుకు, పాత మిత్రుడు, శత్రువు కూడా అయిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు అండగా ఉన్న మీడియా, టాలీవుడ్.. ఇలా ఎవరినీ వదలడం లేదు. దీంతో బీజేపీ ఎత్తుగడలు ఇప్పుడు చంద్రబాబుకు ఊరటనిస్తున్నాయి. అలాగే ఏపీ రాజకీయాల్లో పట్టు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న జగన్ ను మాత్రం చికాకు పెడుతున్నాయి.

జగన్ కు చుక్కలు చూపిస్తూ..
తెలంగాణలో అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గతంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబును అక్కున చేర్చుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ.. అదే క్రమంలో జగన్ కు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీకి, అంతకంటే జగన్ కు కీలకమైన పోలవరం ప్రాజెక్టు కోసం వైసీపీ సర్కార్ ఖర్చుపెట్టిన నిధులు ఇవ్వకుండా ఆలస్యంచేస్తోంది. అలాగని రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంలోనూ జగన్ కు మద్దతిచ్చినట్లే ఇచ్చి తిరిగి అమరావతివైపు టర్న్ తీసుకుంది. ఇలా రెండు కీలక విషయాల్లో జగన్ ను ఇబ్బంది పెడుతున్న బీజేపీ.. అదే సమయంలో చంద్రబాబుపై జగన్ కోరిన సీబీఐ దర్యాప్తు చేయించకపోగా.. ఆయనకు తాజాగా కుప్పం టూర్ లో అదనపు భద్రత కూడా ఇచ్చేసింది. దీంతో పాటు తాజాగా మోడీ అపాయింట్మెంట్ దొరకడం చంద్రబాబుకు భారీ ఊరటగా మారింది. ఇవన్నీ జగన్ ను చికాకుపెడుతున్నాయి.

జగన్ ఆ ఒక్క అడుగేస్తే చాలు
ఓవైపు జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, కేంద్ర పథకాల నిధులు మళ్లించుకోకుండా కట్టడి చేయడమే కాకుండా విభజన హామీల్లో కొత్తగా ఒక్క దాన్నీ అమలు చేయకపోవడం చూస్తుంటే బీజేపీ తీరు అర్ధమవుతోంది. గతంలో జగన్ తెచ్చిన ఒత్తిడితో ప్రత్యేక హోదా అడిగిన చంద్రబాబుకు ఇలాంటి సహాయనిరాకరణతోనే మరింత టార్గెట్ చేసి ఎన్డీయే నుంచి వెళ్లిపోయేలా చేసిన బీజేపీ.. సరిగ్గా ఇప్పుడు కూడా అదే రాజకీయాన్ని రిపీట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఈ ఒత్తిడికి తట్టుకోలేక జగన్ ఎక్కడైనా స్పందిస్తే, లేదా బీజేపీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తే దాన్ని సాకుగా తీసుకుని పాత రాజకీయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు కాషాయ శిబిరం ఎత్తులు వేస్తోంది. అందుకే బీజేపీకి జగన్ ఆ ఒక్క అవకాశం ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జగన్ స్పందనే గేమ్ ఛేంజర్ ?
ఇప్పుడున్న పరిస్ధితుల్లో బీజేపీ నుంచి సహకారం అందకపోయినా వైఎస్ జగన్ ఎప్పటిలాగే మౌనంగానే ఉంటున్నారు. బీజేపీ కోరుకున్నట్లుగా దూకుడుగా స్పందించడం లేదు. చంద్రబాబు గతానుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఎదురుదాడి కంటే లాబీయింగ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో బీజేపీ మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో జగన్ పై పోరు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ కారణాలతో మద్దతిస్తోంది. దీంతో జగన్ ఎక్కడైనా సహనం కోల్పోతే ఏపీలోనూ టీడీపీ-బీజేపీ పొత్తు కుదుర్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. మరి జగన్ బీజేపీకి ఆ అవకాశం ఇస్తారా, ఇవ్వకపోతే బీజేపీ మరిన్ని అంశాల్లో జగన్ ను టార్గెట్ చేయబోతోందా ? తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుని గెలిస్తే ఏం జరగబోతోంది ? అన్న అంశాలే ఏపీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.












Click it and Unblock the Notifications