కిరణ్ రెడ్డిని బాబు అడ్డుకుంటున్నారా, ఎందుకు?
హైదరాబాద్: బిజెపిలో చేరడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధపడిపోయినట్లు బలంగా వార్తలు వచ్చాయి. ఇటీవలి పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలో కిరణ్ రెడ్డి బిజెపిలో చేరుతారని బలంగా ప్రచారం సాగింది. అయితే, అటువంటిదేమీ జరగకుండానే అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన ముగిసింది.
అయితే, బిజెపిలో కిరణ్ కుమార్ రెడ్డి చేరికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారనే ప్రచారం సాగింది. ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే - చంద్రబాబు ఎలా అడ్డుకుంటారని, అది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని, ఎవరినైనా చేర్చుకునే స్వేచ్ఛ తమకు ఉందని అమిత్ షా అన్నారు. కానీ, కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకుంటే బిజెపితో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సంబంధాలు దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించే వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా చూసినా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం లేదు. అటువంటప్పుడు బిజెపిలో ఆయన చేరికను ఎందుకు అడ్డుకుంటారనే ప్రశ్న రావడం సహజం. కానీ, చంద్రబాబు దూరదృష్టితో ఆ పని చేసి ఉండవచ్చునని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలోకి రావడానికి ఉన్న అడ్డంకుల్లో చంద్రబాబుతో పాటు మరో అంశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాయలసీమకు చెందిన ఓ సామాజిక వర్గం నాయకులు ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. క్రమంగా జగన్ బలహీనపడుతున్న సూచనలు ఉన్నాయని బిజెపి భావిస్తోంది. జగన్ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో పాటు ఆయనకు సన్నహితులైన నాయకులు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటపడే పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. వారంతా తెలుగుదేశం పార్టీలో చేరకపోవడానికి తగిన కారణాలున్నాయి. సామాజిక, స్థానిక పరిస్థితులు, స్థానిక నాయకత్వాలు అందుకు అవకాశం లేకుండా చేశాయని అంటున్నారు. పైగా, కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటోంది. దాంతో తెలుగుదేశం పార్టీలో చేరలేని నాయకులకు తప్పకుండా బిజెపి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.
ఆ రాజకీయ వాతావరణంలో వచ్చే ఎన్నికల నాటికి, అంటే 2019 నాటికి బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణనీయంగా బలపడే అవకాశాలున్నాయి. తనకూ తన పార్టీకి నష్టం జరగకుండా బిజెపి పెరిగి వైయస్ జగన్ బలహీనపడితే చంద్రబాబుకు మంచిదే. కానీ, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవికి పోటీ ఏర్పడితే చంద్రబాబుకు కష్టమే అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి స్థాయి నాయకుడు బిజెపిలో చేరితే ఆ ప్రమాదం ఉండవచ్చు. పైగా, జగన్ బలహీనపడితే ఆ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి తప్పకుండా బలపడుతారు. జగన్ సామాజిక వర్గం, కిరణ్ రెడ్డి సామాజిక వర్గం ఒక్కటే కాబట్టి ఆ అవకాశం తప్పకుండా ఉంటుంది.
నిజానికి, ఓ సామాజిక వర్గం జగన్ వెంట నడవకుండా ఉండడానికే కాంగ్రెసు అధిష్టానం కిరణ్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. కానీ అందులో కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించకపోవడానికి అప్పటి పరిస్థితులే కారణం. జగన్ మీద ఓ వర్గం నాయకులకు అపారమైన నమ్మకం ఉండింది. అయితే, అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం, బిజెపితో టిడిపి పొత్తు జగన్ అవకాశాలను దెబ్బ తీశాయి. దాంతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వర్గమంతా నీరసపడిపోయింది. అదే ఇప్పుడు బిజెపి బలం పుంజుకోవడానికి ఉపయోగపడుతుంది. కాలం ముందుకు కదులుతున్న కొద్దీ మరిన్ని పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కాంగ్రెసు బలపడే అవకాశాలు అతి తక్కువగానే ఉన్నాయి. దాంతో బిజెపి, తెలుగుదేశం పార్టీలే సమాంతరంగా ఎదిగే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీకి సమానంగా బిజెపి ఎదిగితే మహారాష్ట్రలో పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడవచ్చు. శివసేన, బిజెపి కూటమి విషయంలో తలెత్తిన పరిణామాలే బిజెపి, టిడిపి కూటమి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితి ఎదురైతేనే చంద్రబాబుకు ఇబ్బంది అవుతుంది. అందుకే, చంద్రబాబు బిజెపిలో కిరణ్ కుమార్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఏమైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చాలా మార్పులకు లోనయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications