కిరణ్ జివోఎం నోట్‌పై పావులు, ఎమ్మెల్యేలకి మెటీరియల్
హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు మంత్రుల బృందం (జివోఎం) నోట్‌లోని అంశాలే ప్రధానం కానున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని పలు కీలక విభాగాలు నోట్‌లోని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయని, ముఖ్యమంత్రి, రాష్ట్రమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
శనివారం పులిచింతల ప్రాజెక్టు బహిరంగ సభ ముగిసిన అనంతరం కిరణ్, మంత్రులు, మాజీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర నాయకులు విభజన అంశంపై చర్చించారు. కేంద్ర కేబినెట్‌లో ప్రస్తావించిన పలు అంశాలకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు వస్తాయని, వాటికి సవరణలు చేయాల్సి ఉందని కేంద్ర కీలక విభాగాలు సూచించాయని, ఒకవేళ వాటినే కొనసాగించాల్సి వస్తే రాజ్యాంగపరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చునని కిరణ్ అన్నారట.

జివోఎం నోట్ బయటకు రావడంతో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కన్నా రాష్ట్ర విభజన మరింత నష్టదాయకమవుతుందని, తెలంగాణ వారికే ఇబ్బందులు పెరుగుతాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. విభజన నిర్ణయం నేపథ్యంలో అడ్డుకునేందుకు అంశాలన్నింటి పైన చర్చించాల్సి ఉంటుందని, అసెంబ్లీలో చర్చించేందుకు అందరికీ అవగాహన కల్పించడం కోసం స్టడీ మెటీరియల్ అందజేస్తే బాగుంటుందని మండలి బుద్ధప్రసాద్ సూచించగా సిఎం చూద్దామన్నారట.
కాగా, అంతకుముందు పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సమయంలో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఈ రణరంగంలో చొచ్చుకుపోతున్న ముఖ్యమంత్రి అభిమన్యుడిలా చిక్కుకుపోతాడో లేక అర్జునుడిలా ఛేదించుకుని బయటపడతాడో చూడాలన్నారు. ప్రజాభిమానం మెండుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తప్పక విజయం సాధించి తీరతారని, ప్రజల దీవెనలే ఆయనకు పెట్టని కవచంలా రక్షణ కల్పిస్తాయన్నారు.












Click it and Unblock the Notifications