తప్పా?: కిరణ్ కర్రీ పాయింట్ వ్యాఖ్యలపై కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కర్రీ పాయింట్ పెట్టుకోవాలని తాను అంటే తప్పేమిటని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అడిగారు. తాను ఆ మాటంటే ముఖ్యమంత్రిని అంత మాటంటావా అని అడిగారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాలు, కూరగాయలు అమ్ముకుంటున్నారని, తనకు వ్యవసాయం తెలుసు కాబట్టి అది చేసుకుంటానని ఆయన అన్నారు. హైదరాబాదులో కరాచీ బేకరీ, బాంబే బేకరీ ఉన్నాయని ఆయన అన్నారు.
హైదరాబాదులోని మింట్ కాంపౌండులో జరిగిన తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల సభలో ఆయన శనివారం సాయంత్రం ప్రసంగించారు. హైదరాబాదును తానే కట్టానని చంద్రబాబు అంటున్నారని, సీమాంధ్రలో కూడా చంద్రబాబు ఓ హైదరాబాదును కట్టవచ్చు కదా అని ఆయన అన్నారు. తాను స్వీచాన్ చేస్తేనే హైదరాబాదులో బల్బు వెలిగిందని చంద్రబాబు అంటున్నారని, హైదరాబాదుకు విద్యుత్ వచ్చిన 15 ఏళ్లకు మద్రాసుకు కరెంట్ వచ్చిందని కెసిఆర్ అన్నారు.
హైదరాబాదుకు ఐటిఐఆర్ ప్రాజెక్టు రాబోతోందని, దాంతో హైదరాబాదులో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చెందుతాయని, తెలంగాణకు హైదరాబాదు ఆర్థిక వెన్నెముకగా మారబోతోందని ఆయన అన్నారు. హైదరాబాదు భారతదేశపు సిలీకాన్ వ్యాలీ అవుతుందని ఆయన అన్నారు.

హైదరాబాదుపై కిరికిరి పెడితే అంగీకరించబోమని, పదేళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడిగా రాజధానిగా అంగీకరించామని, హైదరాబాదుకు సంబంధించి ఆంక్షలు పెడితే భవిష్యత్తు తరాలు నష్టపోతాయని ఆయన అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. తమకు సంపూర్ణ తెలంగాణ కావాలని ఆయన అన్నారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండకూడదని ఆయన అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగమంటే శ్రమదోపిడీయేనని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే హైదరాబాదులో సకల సదుపాయాలున్నాయని, విమానాశ్రయం, రైల్వే, పోస్టల్ డిపార్టుమెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనైజీ ఉన్నాయని, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారని, కాస్మోపాలిటన్ సిటీగా రూపుదిద్దుకుందని ఆయన అన్నారు. రేపు తెలంగాణలో విస్తరించేది విద్యుత్ రంగమేనని, ఐదేళ్లలో 15 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా చూసుకోవాలని, తద్వారా చత్తీస్‌గడ్ మాదిరిగా విద్యుత్తులో మిగులు సాధించాలని, రైతులకు 24 గంటలు విద్యుత్ అందించాలని ఆయన అన్నారు. తమకు చిరునవ్వుల తెలంగాణ కావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications