సభ్యులతో పాటు సభ: టి బిల్లుపై ప్రణబ్ ట్విస్ట్? ఉత్కంఠ
హైదరాబాద్: తెలంగాణ బిల్లు పైన సభ్యుల అభిప్రాయంతో పాటు సభ అభిప్రాయాన్ని కూడా రాష్ట్రపతి కోరినట్లుగా తెలుస్తోంది. గురువారం సాయంత్రం తెలంగాణ బిల్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. శుక్రవారం మధ్యాహ్నం లోగా బిల్లు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బిల్లు పైన సభలో ఓటింగ్ జరుగుతుందా అనే చర్చ సాగుతోంది.
రాష్ట్రపతి.. బిల్లుపై సభ్యుల అభిప్రాయంతో పాటు సభ అభిప్రాయం కూడా కోరడం అందరిలోను ఉత్కంఠ కలిగిస్తోందంటున్నారు. సభలో ఏకాభిప్రాయం వచ్చే అవకాశం లేదు. దీంతో ఓటింగు జరుగుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఓటింగు జరిగితే మెజార్టీ సభ్యులు సీమాంధ్ర నుండి ఉన్నారు. కాబట్టి దానికి ఆస్కారం లేదని తెలంగాణ ప్రాంత నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిల్లుపై ఏం జరగనుందనే ఉత్కంఠ కొనసాగతోంది.

స్పీకర్, ముఖ్యమంత్రితో తెలంగాణ మంత్రుల భేటీ
సభాపతి నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలతో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. స్పీకర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డితో పాటు మంత్రులు కలిశారు. ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టే విషయమై స్పీకర్ నుండి తమకు హామీ వచ్చిందని మంత్రులు చెప్పారు.
సమైక్యాంధ్ర కోసం టిడిపి ఎమ్మెల్యేల నోటీసు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, శాసన సభలో తీర్మానం చేయాలని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభాపతికి నోటీసు ఇచ్చారు. తామిచ్చే అనధికార తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టాలని కోరారు. లింగారెడ్డి, రామకృష్ణ, కందుల నారాయణ రెడ్డి తదితరులు నోటీసులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications