బీజేపీ 'పవర్': పవన్ కళ్యాణ్‌ను వెంకయ్య పిలిచారా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు భారతీయ జనతా పార్టీ ఇచ్చే ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ - టీడీపీ కూటమికి ఆయన జోరుగా ప్రచారం చేశారు. పవన్ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకున్నారు. తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్‌కు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల అనంతరం ఆయనను చాలామంది నేతలు కలిశారు. ఏపీలో పవన్ కళ్యాణ్‌తో కలిసి వెళ్తేనే బాగుంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్‌కు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నుండి పిలుపు వచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారని చెబుతున్నారు. వెంకయ్య తన సొంత జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరపనున్నారు.
జనవరి 11 నుండి సంబరాలు ప్రారంభమవుతాయి. దీనికి పవన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారని అంటున్నారు. వెంకయ్య విజ్ఞప్తికి పవన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు బీజేపీ ఇచ్చే ప్రాధాన్యతను చూస్తుంటే ఆయనతోనే కలిసి ముందుకు వెళ్లేందుకు మొత్తం సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications