చెక్కేశాడు, బోర్డు తిప్పేసిన ఐటీ సంస్థ: కూలిన థియేటర్ పైకప్పు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ ఐటీ సంస్థ బోర్డు తిప్పేసింది. రాజమండ్రిలోని ఓషన్ మీడియా ఐటీ సొల్యూషన్స్ సంస్థ చాలమందిని బురిడీ కొట్టించింది. ఈ ఐటీ సంస్థకు చెందిన యజమాని దాదాపు ఏడెనిమిది వందల మంది నుండి రూ.50వేల నుండి రూ.లక్ష వరకు తీసుకొని పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న బాధితులు కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బాధితులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ చైర్మన్ మొత్తం ఎనిమిది నుండి ఇరవై ముప్పై కోట్ల వరకు బాధితుల నుండి తీసుకొని ఉంటారని భావిస్తున్నారు.

నిరుద్యోగులకు ఆశ చూపి వారిని నిండుగా మోసం చేశాడు. దాదాపు మూడు నెలల కాలంలోనే అతను వందల మంది నుండి పెద్ద మొత్తం వసూలు చేశాడు. రూ.500 కట్టి, మరికొంతమందిని చేర్పిస్తే పదిహేను రోజుల్లో అంతకు ఎక్కువ డబ్బు వస్తుందని.. చెప్పి బాధితుల నుండి లక్షలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.
జీడిమెట్లలో కూలిన థియేటర్ పైకప్పు
జీడిమెట్ల షాపూర్‌నగర్‌లోని రంగా థియేటర్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఆపరేటర్ సహా ఏడుగురికిగాయాలయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నానిపోయి పైకప్పు కూలినట్టు అనుమానిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు థియేటర్ యజమాని పైన కేసు పెట్టారు.












Click it and Unblock the Notifications