వైఎస్ హయాంలో కొల్లగొట్టారు: జగన్‌ను ఏకేసిన సోమిరెడ్డి
హైదరాబాద్/ విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని వైయస్ జగన్ రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారని ఆయన ధ్వజమెత్తారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు గుర్తించిన పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. వైఎస్ హయాంలో ఏపీ అవినీతిలో అగ్రస్థానంలో నిలిచిందని, ఏపీకి పర్యాటకులు కూడా రాని పరిస్థితి నెలకొందని ఆయన గుర్తు చేశారు.
వైఎస్ లూటీ చేసిన డబ్బును ప్రజలకు అప్పగిస్తే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్ హయాంలో జగన్ తన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

జగన్ దీక్ష జనం కోసం కాదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రతిపక్ష నేత జగన్ చేపడుతున్న దీక్ష జనం కోసం కాదని స్వలాభం కోసమని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని , ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. రుణమాఫీ అందనివారు ఆందోళనచెందరాదని , అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి పుల్లారావు చెప్పారు.












Click it and Unblock the Notifications