జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్: రాత్రికి రాత్రి ఆదేశాలు
Janga Krishna Murthy: తెలుగుదేశం పార్టీలో చేరిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో- ఆయనపై అనర్హత వేటు పడింది. ఆయనను అనర్హుడిగా ప్రకటించింది శాసన మండలి. ఈ మేరకు ఛైర్మన్ కొయ్యె మోషెన్ రాజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
పార్టీ ఆవిర్భావం నుంచీ వైఎస్ఆర్సీపీలో పని చేస్తూ వచ్చిన వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.. జంగా కృష్ణమూర్తి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి గురజాల అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. 2014లో గురజాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ- పార్టీకి చేసిన సేవలను గౌరవిస్తూ ఆయనను శాసనమండలికి నామినేట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఈ ఎన్నికల్లో కూడా గురజాల నుంచి మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ జంగా కృష్ణమూర్తి విశ్వ ప్రయత్నాలు చేశారు గానీ అది సాధ్యపడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కాదని ఆయనకు టికెట్ కేటాయించడానికి ఆసక్తి చూపలేదు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది.
దీనితో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొద్దిరోజుల ముందు జంగా కృష్ణమూర్తి.. వైఎస్ఆర్సీపీ గుడ్‌బై చెప్పారు. చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొన్నారు. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఇదివరకే ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై తాజాగా శాసన మండలి ఛైర్మన్ కొయ్యె మోషెన్ రాజు స్పందించారు. జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు పడుతుంది.












Click it and Unblock the Notifications