కలకలం: కొణతాల రాజీనామాపై కదిలిన జగన్
హైదరాబాద్: పార్టీ పదవికి కొణతాల రామకృష్ణ చేసిన రాజీనామా వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తీవ్ర కలకలం రేపింది. పార్టీ నాయకత్వం ఒక్కసారిగా కదిలిపోయి కొణతాల రామకృష్ణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడడానికి ప్రయత్నించింది. వైయస్ జగన్ ప్రత్యేకంగా పార్టీ నాయకులతో సమావేశమై కొణతాల రాజీనామాకు గల కారణాలేమిటో తెలుసుకోవాలని సూచించారు.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా తనకు ఇచ్చిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు, దాంతో సంతృప్తి చెందకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని చెబుతూ కొణతాల రామకృష్ణ మంగళవారం వైయస్ జగన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను ఆయన పార్టీ కార్యాలయానికి ఫాక్స్ ద్వారా పంపించారు.

ఆ లేఖ అందిన వెంటనే జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై కొణతాలను సంప్రదించాల్సిందిగా పురమాయించారు. అయితే, ఫోన్‌లో కొణతాల రామకృష్ణ అందుబాటులోకి రాలేదు. దాంతో తర్వాత కనుక్కుని తనకు విషయం చెప్పాలని జగన్ వారికి సూచించారు. తన రాజకీయ కార్యదర్శులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, పార్టీ పిఎసి సభ్యులు ఎంవి మైసురా రెడ్డి, డిఎ సోమయాజులు, మాజీ మంత్రి విశ్వరూప్ తదితర నేతలు భేటీలో పాల్గొన్నారు.
గండి బాబ్జీ వ్యవహారం విషయంలోనే కొణతాల రామకృష్ణ మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అయితే, గండి బాబ్జీ విషయంలో జగన్ స్పందించలేదు. విశాఖపట్నంలో తుఫాను బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వస్తూ పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త పదవి నుంచి గండి బాబ్జీని తొలగిస్తూ ఈ నెల 22వ తేదీన నిర్ణయం తీసుకున్నారు.
అయితే, కొణతాల రామకృష్ణ వ్యూహాత్మకంగానే రాజీనామా చేశారని చెబుతున్నారు. ఆయన చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పైగా, తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.












Click it and Unblock the Notifications