ఏపీలో భూముల ధరలకు రెక్కలు; మార్కెట్ విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడుకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలతో పాటు మరో 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ, మొత్తం 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఒక్కసారిగా వివిధ ప్రాంతాలలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో భూముల మార్కెట్ విలువలు సవరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కసరత్తు మొదలు పెట్టింది.

గతేడాది కరోనా కారణంగా పెంచని భూముల మార్కెట్ ధరలు
ప్రతిఏటా ఆగస్టు ఒకటవ తేదీన భూముల ధరలను ప్రభుత్వం పెంచుతున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది కూడా ఆగస్టు 1 నుండి భూముల ధరలు పెంచాలని మొదట భావించినా, వివిధ వర్గాల నుండి సాధారణ ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 2021 సంవత్సరం లో భూములమార్కెట్ ధరలపెంపుకు బ్రేక్ వేసింది ఏపీ సర్కార్. కరోనా కారణంగా భూముల మార్కెట్ ధరలను పెంచడం లేదనివెల్లడించి అప్పుడు సామాన్యులకు తీపి కబురు చెప్పింది. గతేడాది కూడా భూముల మార్కెట్ ధరలు పెంచక పోవడంతో, ఈ ఏడాది భూముల మార్కెట్ ధరలు పెంచటం పైన దృష్టి సారించింది ఏపీ సర్కార్.

ఏప్రిల్ నుండి భూముల కొత్త మార్కెట్ విలువలు అమలు,రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు
వచ్చే ఏప్రిల్ నుంచి ఆస్తుల కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చేలా, ఆస్తుల విలువ పెంపుపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇక ఆస్తుల విలువ పెంపును బట్టి కొనుగోలుదారుల పై రిజిస్ట్రేషన్ చార్జీల భారం కూడా పడనుంది. భూముల మార్కెట్ విలువ పెరిగితే, తదనుగుణంగా రిజిస్ట్రేషన్ చార్జీల భారం కూడా పెరుగుతుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి సవరించే మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చేలా జిల్లా అధికారులు కమిటీల ద్వారా ఖరారు చేయాలని ఏపీ సర్కార్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇప్పటికే గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లాలలో భూముల ధరల పెంపు
ఆస్తులు విలువ సవరణలకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఏప్రిల్ ఒకటి 2022 కాగా, గుంటూరు జిల్లా నరసరావుపేట, బాపట్ల పరిధిలోని గ్రామాలలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. ఈ పట్టణాలను ప్రభుత్వం ఇటీవల జిల్లాలుగా ప్రకటించింది. వీటికి సమీపంలోని సుమారు 20 గ్రామాలలో భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆస్తులు విలువ ను పెంచినట్లు గా తెలుస్తుంది. ముఖ్యంగా నరసరావుపేట శివారు గ్రామాలలో భూముల మార్కెట్ విలువ పైపు 100% గా ఉంది. బాపట్ల లోని పలు ప్రాంతాలలో ఇప్పటికే భూముల మార్కెట్ విలువను పెంచారు.

బాపట్ల, నరసరావు పేట జిల్లాలలో భూముల ధరలకు రెక్కలు
ఇదిలా ఉంటే పట్టణంలో గజం భూమి విలువ 2,100 రూపాయల నుండి మూడు వేల రూపాయలకు సవరించారు. వ్యవసాయ భూములు ఎకరానికి 5.25 లక్షల రూపాయలు ఉంటే ఏడు లక్షల రూపాయలకు పెంచారు. నరసరావుపేట పట్టణ సమీపంలోని రావిపాడు మినహా మిగతా అన్ని గ్రామాలలో వ్యవసాయేతర భూముల విలువ బాగా పెరిగింది. గజం 1500 రూపాయల నుంచి 3 వేల రూపాయలకు ధరలు పెంచి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రావిపాడు లో అయితే ఏకంగా ఐదు వేల రూపాయల ధరలను పెంచినట్లు గా సమాచారం.
Recommended Video

ఆస్తుల మార్కెట్ విలువ పెంపుతో కొనుగోలుదారుల పై రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు
ఆస్తుల మార్కెట్ విలువ సవరణ వల్ల కొనుగోలుదారుల పై రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడుకు తెర తీసినట్లు అయింది. దీంతో ఎకరాకు కొనుగోలుదారులకు 30 వేల రూపాయల నుంచి 50 వేల వరకు అదనపు భారం పెరిగింది. ఇదిలా ఉంటే తెనాలి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పరిధిలోనూ కొంత వరకు భూముల మార్కెట్ ధరలను సవరించారు. గతేడాది కూడా మార్కెట్ విలువలను పెంచకపోకోవడంతో, ఈ ఏడాది భూముల మార్కెట్ ధరలు పెంచి తద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలతో ఆదాయ మార్గాలను అన్వేషించే పనిలో పడింది ఏపీ సర్కార్. రిజిస్ట్రేషన్ చార్జీల ధరలు పెంచితే ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది కాబట్టి భూముల మార్కెట్ ధరలను పెంచుతూ, రిజిస్ట్రేషన్ బాదుడుకు శ్రీకారం చుట్టింది అన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో వ్యక్తమౌతుంది.












Click it and Unblock the Notifications