వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం ఆదేశాల్ని లెక్క చేయని జగన్--ఎమ్మెల్యే కాకాణికి ఊరట-హైకోర్టు నిర్ణయం కీలకం

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల్ని విచ్చలవిడిగా ఉపసంహరిస్తున్న అధికార రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు తాజాగా ఓ ఝలక్ ఇచ్చింది. హైకోర్టు అనుమతి లేకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఉపసంహరించిన కేసుల్ని తిరగదోడాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే కేసుల్ని ఉపసంహరించిన అధికార పార్టీలు ఇరుకునపడ్డాయి. అయితే ఏపీ సర్కార్ మాత్రం సుప్రీం ఆదేశాల్ని లైట్ తీసుకుంది. తాజాగా మరో ఎమ్మెల్యేపై కేసును ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది.

 కేసుల ఎత్తివేతపై సుప్రీం ఆదేశాలు

కేసుల ఎత్తివేతపై సుప్రీం ఆదేశాలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు గతంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసుల్ని ఎత్తేస్తున్నాయి. ఆధారాలు లేవనో, మరే ఇతర కారణాలతోనో ఈ కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నాయి. ఈ మేరకు ప్రాసిక్యూషన్ ఉపసంహరిస్తూ ఆదేశాలు ఇస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా కన్నెర్ర చేసింది. హైకోర్టు అనుమతి లేకుండా ఏ ట్రయల్ కోర్టు కానీ, ప్రభుత్వం కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్ని ఎత్తేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇరుకునపడ్డాయి.

 వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల ఉపసంహరణ

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల ఉపసంహరణ

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల్ని నమోదు చేసింది ఇందులో సీఎం జగన్ తో పాటు పలువురిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే వీటిని క్రమంగా ఉపసంహరించుకోవడం మొదలుపెట్టింది. సీఎం జగన్ పై నమోదైన 15 కేసులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ గౌతం సవాంగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీనిపై అభ్యంతరాలు మొదలయ్యాయి

తన కేసుల్ని ఎత్తేసుకున్న జగన్

తన కేసుల్ని ఎత్తేసుకున్న జగన్

సీఎం జగన్ గతంలో తనపై టీడీపీ ప్రభుత్వం నమోదు చేసిన 11 కేసుల్లో ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకుంటూ అధికారులతో ఆదేశాలు జారీ చేయించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ఉపసంహరణలు చెల్లవని స్పష్టం చేసింది. సదరు కేసుల్ని ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరుపుతోంది. ఇందులో ప్రభుత్వం పలు కారణాల్ని కోర్టు ముందుంచింది. అయినా ఇంకా హైకోర్టు జగన్ కు ఇప్పటికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఈ కేసుల్లో హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా మళ్లీ విచారణ ప్రారంభం కాబోతోంది. కేసుల ఉపసంహరణ చట్టబద్ధమే అని తేలితే తప్ప జగన్ కు ఊరట దక్కే అవకాశం లేదు.

 ఎమ్మెల్యే కాకాణిపై కేసు ఎత్తేసిన జగన్ సర్కార్

ఎమ్మెల్యే కాకాణిపై కేసు ఎత్తేసిన జగన్ సర్కార్

టీడీపీ మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మలేషియా, హాంకాంగ్‌, సింగపూర్‌ లో రూ.1,000కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ గతంలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించి కొన్ని పత్రాలు కూడా విడుదల చేశారు. అయితే తనపై కాకాణి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నకిలీ పత్రాలతో కుట్రలు పన్నుతున్నారని నెల్లూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌లో సోమిరెడ్డి ఫిర్యాదుచేశారు. కేసు విచారించిన పోలీసులు... కాకాణి విడుదల చేసిన పత్రాలు నకిలీవని తేల్చారు. వాటిని తయారుచేసిన చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్టుచేశారు. దీంతో కొన్నిరోజుల పాటు కాకాణి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్ ను జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు నెల్లూరు జిల్లా 4వ అదనపు జడ్జి కోర్టులో ఉన్న ఈ కేసు ప్రాసిక్యూషన్ ను ఉపసంహరిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

 సుప్రీం ఆదేశాల బేఖాతర్

సుప్రీం ఆదేశాల బేఖాతర్

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్ని హైకోర్టు అనుమతి లేకుండా ఉపసంహరించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ వైసీపీ సర్కార్ తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసును వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు అనుమతి లేకుండా జిల్లా జడ్జి కోర్టులో ఉన్న ఈ కేసును వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా ఉన్న ఈ నిర్ణయంపై అప్పుడే టీడీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టేశారు. ముఖ్యంగా కాకాణిపై ఎప్పటినుంచో పోరాడుతున్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 ధిక్కారంపై హైకోర్టు ఏం చెబుతుందో ?

ధిక్కారంపై హైకోర్టు ఏం చెబుతుందో ?

సుప్రీంకోర్టు తాజాగా హైకోర్టు అనుమతి లేకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉపసంహరించరాదంటూ ఇచ్చిన ఆదేశాల్ని లెక్కచేయకుండా జగన్ సర్కార్ ఎమ్మెల్యే కాకాణిపై కేసు వెనక్కి తీసుకోవడంపై హైకోర్టును ఆశ్రయించేందుకు టీడీపీ సిద్దమవుతోంది. ఈ మేరకు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కారంపై జగన్ సర్కార్ ను ఇరుకునపెట్టాలని భావిస్తున్న ఆయన.. హైకోర్టులో పిటిషన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు తీసుకోబోయే నిర్ణయమే కీలకం కానుంది. ఒకవేళ హైకోర్టు కాకాణిపై కేసు ఉపంసంహరణను సమర్ధిస్తే మాత్రం ఆయనకు ఊరట దక్కనుంది. అలా కాకుండా సుప్రీం ఆదేశాల్ని ధిక్కరిస్తూ తమ అనుమతి లేకుండా కేసు ఉపసంహరించారని భావిస్తే మాత్రం జగన్ సర్కార్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

English summary
andhrapradesh government has defied supreme court's recent orders on withdrawal of cases against mps and mlas without high court consent and lifted case against ruling party mla kakani govardhan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X