రేపు పీఆర్సీ నివేదిక కష్టమే ? -ఉద్యోగుల్లో విభేధాలు-సొమ్ము చేసుకుంటున్న జగన్ సర్కార్
ఏపీలో ఉద్యోగ సంఘాలు కోరుతున్న విధంగా పీఆర్సీ నివేదికను రేపు ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు. రేపు ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో పీఆర్సీ నివేదిక ఇస్తామని లీకులు ఇస్తున్నా ఇవాళ జీఏడీ సర్వీసెస్ సెక్రటరీతో జరిగిన భేటీలో ఉద్యోగ సంఘాలకు దీనిపై ఎలాంటి హామీ లభించలేదు. అదే సమయంలో ఉద్యోగ సంఘాల మధ్య పీఆర్సీ నివేదికపై పోరు పెరుగుతోంది. ప్రభుత్వానికి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా ఉద్యోగులు చీలిపోవడమే ఇందుకు కారణం.

ఏపీ ఉద్యోగుల పీఆర్సీ పోరు
ఏపీలో ఉద్యోగులకు బకాయి ఉన్న పీఆర్సీని అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ వ్యవహారం కాకరేపుతోంది. ఉద్యోగుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో దీనిపై స్పందిస్తున్న ప్రభుత్వ వర్గాలు, అధికారులు పీఆర్సీ నివేదికపై ఇప్పటికీ ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నాయి. నిన్న పీఆర్సీ నివేదిక కోరుతూ సచివాలయంలోనే బైఠాయించి ఉద్యోగులు నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి మాత్రం ఇవాళ్టికీ ఎలాంటి హామీ రాలేదు. కేవలం రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని మాత్రమే ప్రభుత్వం ప్రకటించి ఊరుకుంది. దీంతో ప్రభుత్వ అనుకూల ఉద్యోగ సంఘం మాత్రం రేపు పీఆర్సీ వ్యవహారం తేలిపోతుందని చెబుతోంది.

ఇప్పుడే ఇవ్వలేమన్న సర్కార్
ఇవాళ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఇందులో వెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగులు కోరారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాల మెంబర్ షిప్ వివరాలు కూడా కోరారు. దీనిపై సందించిన శశిభూషణ్... సీఎంఓ అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని శశిభూషణ్ చెప్పారని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. తన చేతుల్లో ఏం లేదు.. సీఎం, సీఎస్ చేతుల్లోనే అంతా ఉందని శశిభూషణ్ స్పష్టంగా చెప్పారన్నారు.

పీఆర్సీపై ఉద్యోగుల్లో చీలిక
కీలకమైన పీఆర్సీ విషయలో రెండు జేఏసీలు పోరాడుతుంటే మూడో జేఏసీ మాత్రం వీరితో కలిసేందుకు సిద్ధపడటం లేదు.
ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇవాళ జీఏడీ సెక్రటరీతో భేటీ అయి పీఆర్సీ నివేదిక వెంటనే ఇవ్వాలని కోరగా.. మరో జేఏసీ నేత వెంకట్రామిరెడ్డి మాత్రం వీరితో విభేదించారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయితే ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ మాత్రం వెంకట్రామిరెడ్డిని కూడా తమతో కలవాలని కోరినట్లు తెలిపాయి. బేషజాలు పక్కన పెట్టాలని కోరినట్లు వెల్లడించాయి. తమపై ఏ ఆరోపణలు చేసినా స్పందించాల్సిన అవసరం లేదన్నాయి. మేం మా దారి తప్పం.. కలిసి రావాలని వెంకట్రామిరెడ్డిని కోరుతున్నట్లు ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు వెల్లడించారు. వెంకట్రామిరెడ్డి కూడా మా సోదరుడే.. ఉద్యోగుల కోసమే మా ప్రయత్నమన్నారు. పెద్ద జేఏసీలుగా ఉన్న మేం ఏకమై పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్నాం కాబట్టి.. పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పీఆర్సీ వ్యవహరాన్ని పక్క దారి పట్టించేలా వెంకట్రామిరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి ఏదో లబ్దిని ఆశించే పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

రేపు పీఆర్సీ నివేదిక అనుమానమే ?
పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందంటే తమకు అనుమనాలు వస్తున్నాయని ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఆరోపించాయి. ప్రభుత్వమే చంద్రశేఖర్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చిందని, పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదన్నారు. పీఆర్సీ నివేదికను మేమూ స్టడీ చేయాలన్నారు. తమ డిమాండ్లు ఆ నివేదికలో ఉందో లేదో తెలియాలి కదా అని వారు ప్రశ్నించారు. పీఆర్సీని వెంటనే అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా..? లేదా.. అని వారు ప్రశ్నించారు. దీంతో రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ నివేదిక బయటికి రావడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications