• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో ఉచిత విద్యుత్‌కు మీటర్లు సాధ్యమేనా ? జగన్ సర్కారు హడావిడి వెనుక కేంద్రం ?

|

ఏపీలో తన తండ్రి, దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మానసపుత్రిక ఉచిత విద్యుత్‌ పథకానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాధినేత, సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఉచిత విద్యుత్‌ మీటర్లు, నగదు బదిలీ పథకంపై ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది ? దీనిపై సమగ్ర అధ్యయనం చేశాకే కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిందా ? లేక అనుకున్నదే తడవుగా ప్రభుత్వం ముందుకెళుతోందా ? అప్పుల విషయంలో కేంద్రం నుంచి ఎదురవుతున్న సమస్యలే ఇందుకు దారి తీశాయా ? ఈ పథకం అమలు చేస్తే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలేంటి ? కేబినెట్‌ నిర్ణయం తర్వాత కూడా ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతోంది ? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...

 ఉచిత విద్యుత్‌-నగదుబదిలీపై జగన్‌..

ఉచిత విద్యుత్‌-నగదుబదిలీపై జగన్‌..

ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడం ద్వారా సాధారణ కనెక్షన్ల తరహాలోనే వాటి రీడింగ్‌ నమోదు చేసి, బిల్లులు పంపి వాటిని చెల్లించేందుకు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొస్తున్న విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్న కేబినెట్‌ ఆమోదం అనంతరం మంత్రి పేర్నినాని ప్రకటించారు. ఏపీకి విద్యుత్‌ సంస్కరణలు కొత్తేమీ కాదు. గతంలో 1999లోనే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రపంచ బ్యాంకు నిధుల షరతుల మేరకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు కోసం ప్రయత్నాలు జరిగాయి.

అప్పట్లో విపక్ష కాంగ్రెస్‌లో ఉన్న జగన్‌ తండ్రి వైఎస్సార్‌ వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం వాటిని బలవంతంగా అమలు చేయబోయి చేతులు కాల్చుకుంది. చివరికి రైతు పక్షపాతిగా అధికారంలోకి వచ్చిన వైఎస్స్రార్‌.. షరతుల్లేకుండా ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వీటికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది.

మిగతా రాష్ట్రాల వ్యతిరేకత- జగన్‌ మాత్రం

మిగతా రాష్ట్రాల వ్యతిరేకత- జగన్‌ మాత్రం

కేంద్రం విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా తీసుకొస్తున్న విద్యుత్‌ మీటర్లను, నగదు బదిలీ పథకాన్ని బీజేపీయేతర రాష్ట్రాలే కాదు బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అంతెందుకు పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసేది లేదని తేల్చిచెప్పేసింది. అక్కడ ఇప్పటికీ షరతుల్లేకుండానే ఉచిత విద్యుత్‌ అమలవుతోంది. కానీ వైఎస్‌ కుమారుడైన జగన్‌ మాత్రం కేంద్రం ఒత్తిడితో ఉచిత విద్యుత్‌కు తూట్లు పొడవడమేంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం చాలా విషయాల్లో రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతుంటుంది.

తాజాగా ఎన్నార్సీ విషయంలోనూ ఒత్తిడి పెంచింది. కానీ స్ధానికంగా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ ఉచిత విద్యుత్‌ మీటర్లపై మాత్రం అందరి కంటే ముందుగానే నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో డిసెంబర్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఓ జిల్లాలో అమలు చేసే నిర్ణయానికి మూడు నెలల ముందే కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

జగన్ స్పీడు వెనుక కారణమిదే...

జగన్ స్పీడు వెనుక కారణమిదే...

ఉచిత విద్యుత్‌ పథకంలో భాగంగా వినియోగిస్తున్న విద్యుత్‌కు మీటర్లు బిగించి బిల్లులు పంపి వాటిని నగదు బదిలీ ద్వారా చెల్లించేలా రైతులను ప్రోత్సహించాలని కేంద్రం చెబుతోంది. కానీ ఈ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగినా అంతిమంగా రైతుల్లో అసంతృప్తి మొదలవుతుంది. దీని ప్రభావం రాష్ట్రమంతా పడుతుంది. ఇవేవీ ఆలోచించకుండా కనీస అధ్యయనం లేకుండా ప్రభుత్వం నగదు బదిలీపై ముందుకెళ్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది.

అయితే తాజాగా రుణాలు తీసుకునే పరిమితిని పెంచుకునేందుకు ఎప్‌ఆర్‌బీఎం చట్టంలో మార్పులు చేసిన ప్రభుత్వం ఆమోదానికి కేంద్రానికి పంపింది. ఇది ఆమోదం పొందితే మరో రూ.20 వేల కోట్ల మేర రుణాలు పొందేందుకు అవకాశం కలుగుతుంది. కానీ కేంద్రం దీని ఆమోదానికి విద్యుత్‌ సంస్కరణలతో ముడిపెడుతోంది. దీంతో తప్పనిసరిగా జగన్ సర్కారు దీన్ని హడావిడిగా కేబినెట్‌లో ఆమోదించింది. తద్వారా తాము నగదు బదిలీపై నిర్ణతీసుకున్నామని కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేస్తోంది.

  Andhra Pradesh : రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు - AP CM YS Jagan || Oneindia Telugu
  హడావిడి నిర్ణయం-కరవైన అధ్యయనం...

  హడావిడి నిర్ణయం-కరవైన అధ్యయనం...

  రైతులకు ఇస్తున్న దాదాపు 18 లక్షల ఉచిత విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్ల బిగింపు, నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో చిన్న, సన్నకారు రైతులతో పాటు ధనిక రైతులు కూడా ఉన్నారు. వీరికి కూడా నగదు బదిలీ చేస్తారా అన్నది ప్రభుత్వం తేల్చడం లేదు. ధనిక రైతులకు నగదు బదిలీ ఎందుకన్న ప్రశ్న తలెత్తితే వీరిని ఈ పథకం నుంచి తప్పించాల్సి ఉంటుంది.

  ఆదాయపు పన్ను కట్టే రైతులకు ఉచిత విద్యుత్‌ ఎందుకివ్వాలన్న ప్రశ్న మొదలైతే ఈ జాబితా నుంచి మరిన్ని కనెక్షన్లు మాయం కాక తప్పదు. అలాగే కార్పోరేట్‌ రైతులకూ ప్రస్తుతం వినియోగంతో సంబంధం లేకుండా హెచ్‌పీకి రూ.200 చొప్పున తీసుకుంటున్నారు. తాజా మార్పులతో వారిని ఏ విధంగా లెక్కిస్తారు. వారికి నగదు బదిలీ ఉంటుందా లేదా తెలియదు. మరెన్నో సంక్లిష్టతలు ఇందులో ఉన్నాయి అటువంటప్పుడు వీటిపై సమగ్ర అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటే బావుండేదనే చర్చ సాగుతోంది.

  English summary
  fixing meters and cash transfer to farmers free power connections in andhra pradesh may become troublesome to ruling ysrcp government because the decision is implementing as without proper study and with centre's pressure only.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X