కరెంటు ఛార్జీల పెంపుపై జగన్ సర్కార్ వివరణ-చంద్రబాబు రూపాయీ ఇవ్వకపోవడం వల్లే
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ దీనిపై వివరణ జారీ చేసింది. ఇందులో కరెంటు ఛార్జీల పెంపుకు దారి తీసిన కారణాలను వివరిస్తూనే మీడియా కథనాలపై అసహనం వ్యక్తం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపును ఆ విధంగా ప్రభుత్వం సమర్ధించుకుంది.
ఏపీలో విద్యుత్ ఛార్జీలను ఈ నెల నుంచి వరుసగా 8 నెలల పాటు పెంచడం ద్వారా గతంలో డిస్కంలకు ఎదురైన నష్టాల్ని భర్తీ చేసేందుకు ఏపీఈఆర్సీ తాజాగా అనుమతులు మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వం కూడా వెంటనే రంగంలోకి దిగి బాదుడు ప్రారంభించేసింది. ఇప్పుడు దీనిపై మీడియాలోనూ భిన్న కథనాలు రావడంతో ప్రభుత్వం వివరణ జారీ చేసింది. ఇందులోనూ గత టీడీపీ సర్కార్ ను దోషిగా చూపేందుకు ప్రయత్నించింది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డిస్కంలకు చెల్లించాల్సిన మొత్తాల్ని అప్పటి చంద్రబాబు సర్గార్ చెల్లించలేదని, దీంతో విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకూ మధ్య వ్యత్యాసం అంతకంతకూ పెరుగుతూ పోయిందని గణాంకాలను బయటపెట్టింది. దీంతో చంద్రబాబు హయాం నుంచి వైసీపీకి అధికారం లభించే సమయానికి ఏకంగా ఈ నష్టాలు రూ.31,844 కోట్లకు చేరాయని జగన్ సర్కార్ వెల్లడించింది. దీని కారణంగానే అటు విద్యుత్ పంపిణీ సంస్ధలు, ఇటు వినియోగదారులు ఇద్దరూ నష్టపోకూడదనే తాము ఈ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఏడాదికి రూ.6 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల పెంంపు అంటూ ఓ సెక్షన్ మీడియాలో వచ్చిన వార్తల్ని మాత్రం ప్రభుత్వం ఖండించింది. ఏడాదికి రూ.6 వేల కోట్ల ఛార్జీల పెంపు ఒట్టిదేనని ప్రకటించింది. గతంలో ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని విద్యుత్ సంస్ధలు ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ కలిపి రూ.3600 కోట్ల మేర ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ నెల నుంచి మొదలుపెట్టి 8 నెలల పాటు ఈ ఛార్జీల్ని వినియోగదారులకు వడ్డించబోతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చినట్లయింది












Click it and Unblock the Notifications