కోనసీమ హింసకు టీడీపీ,జనసేనే కారణం-హోంమంత్రి వనిత ఫైర్-పునరాలోచన లేదన్న సజ్జల
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఇవాళ అమలాపురం, చుట్టు పక్కల ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసపై వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అందరినీ సంప్రదించాకే జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టామని సలహాదారు సజ్జల తెలిపారు. దీనిపై పునరాలోచన లేదన్నారు. మరోవైపు ఈ హింసకు టీడీపీ,జనసేనే కారణమని హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. ప్రజలు సంయమనం పాటించాలని మంత్రి విశ్వరూప్ కోరారు.

కోనసీమ హింసపై జగన్ సర్కార్
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఇవాళ అమలాపురంలో చెలరేగిన హింస వైసీపీ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా అంబేద్కర్ పేరు పెట్టడంపై తొలుత ముందూ వెనుకా ఆలోచించిన ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. కానీ స్ధానికంగా వచ్చిన డిమాండ్లతో ముందడుగు వేసింది. అయితే దీనిపైనా ఇంత ఆగ్రహం ఉందని గమనించలేకపోయింది. చివరిగా ఇవాళ ప్రజాగ్రహం రోడ్లపైకి రావడంతో పాటు మంత్రుల ఇళ్లు తగులబెట్టేవరకూ వెళ్లడంతో పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

పునరాలోచన లేదన్న సజ్జల
కోనసీమ జిల్లాలో ఇవాళ చోటు చేసుకున్న హింసపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అన్ని పార్టీల్ని సంప్రదించాకే పేరు మార్చామని సజ్జల తెలిపారు. ఇవాళ జరిగిన దాడుల వెనుక కొన్ని శక్తులున్నాయని ఆరోపించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై పునరాలోచన లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. మహానేత పేరుపై ఆందోళనలు చేయడం సరికాదని సజ్జల సూచించారు. ఆందోళనలు తగ్గుతాయని భావిస్తున్నట్లు సజ్జల పేర్కొన్నారు.

టీడీపీ, జనసేనే కారణమన్న హోంమంత్రి
కోనసీమలో ఇవాళ చోటుచేసుకున్న దాడులపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ దాడుల వెనుక టీడీపీ,జనసేన ఉన్నాయన్నారు. మహానేత పేరును జిల్లాకు పెడితే తప్పుబట్టడం సరికాదన్నారు. అందరితోనూ సంప్రదించే నిర్ణయం తీసుకున్నామని వనిత వెల్లడించారు. డా.బీఆర్ అంబేద్కర్ మహా మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ఎంతో మందికి స్ఫూర్తి దాయకమన్నారు. అలాంటి మహానుభావుని పేరు ఒక జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకించడం బాధాకరమన్నారు. ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమ గా పేరు మార్చిన విషయాన్ని అందరూ గుర్తించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారన్నారు. గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజు 20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారని, స్కూల్ బస్సుల్ని కూడా తగులబెట్టారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయన్నారు. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను అదేశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

చేతులు జోడించి వేడుకుంటున్నానన్న విశ్వరూప్
కోనసీమలో ఇవాళ చోటు చేసుకున్న అల్లర్లు, తన ఇంటిపై జరిగిన దాడిపై స్ధానిక మంత్రి విశ్వరూప్ స్పందించారు. నిరసనకారుల్ని ఉద్దేశించి విశ్వరూప్ పలు వ్యాఖ్యలు చేసారు. చేతులు జోడించి వేడుకుంటున్నా, మీరందరూ శాంతించాలని ఆయన కోరారు. మీ అభ్యంతరాలు చెప్పండి, పరిశీలిస్తామన్నారు. నా ఇంటిని తగులబెట్టడం దురదృష్టకరమన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినందుకు అందరూ గర్వపడాలన్నారు. యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని విపక్షాలను ఉద్దేశించి విశ్వరూప్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications